Pawan Kalyan: అటవీ మార్గాల్లో వన్యప్రాణుల ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan on Preventing Wildlife Accidents on Forest Routes
  • వేర్వేరు ఘటనల్లో ఆడ పులి, చిరుత మృతి చెందడం దురదృష్టకరమన్న పవన్
  • రెండు ఘటనలపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • వన్యప్రాణులు ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను హాట్ స్పాట్‌లు గుర్తించాలన్న పవన్
వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని, ముఖ్యంగా అటవీ మార్గాల వెంట ప్రయాణించే వాహనదారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రకాశం జిల్లా, మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో వాహనం ఢీకొని ఆడ పులి, ఆదోని రేంజ్‌లో రైలు ఢీకొని చిరుత మృతి చెందిన ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రమాదాలపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అటవీ సరిహద్దు మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంగళవారం వేర్వేరు ఘటనల్లో ఆడ పులి, చిరుత మృతిపై అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఒకే రోజు రెండు ప్రమాదాల్లో పులి, చిరుత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అడవులు, వన్యప్రాణి సంచార మార్గాలకు సమీపంగా ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్ల వద్ద ప్రమాదాల నివారణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హైవే అథారిటీ, రైల్వే, పోలీస్ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.

తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రంబుల్ స్ట్రిప్స్, బ్యారికేడ్లు, సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ మార్గాల సమీపంగా వెళ్లే రహదారుల వెంబడి రాత్రి సమయాల్లో వాహనాల వేగంపై పరిమితులు విధించి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అన్నారు. స్పీడ్ గన్లు, ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు వినియోగించి పరిమితికి మించి వేగంతో వెళ్లే వాహనాలపై జరిమానాలు విధించాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని, వన్యప్రాణుల సంచారం, రక్షణపై వాహనదారులు, స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. 
Pawan Kalyan
Andhra Pradesh
wildlife protection
forest department
road accidents
leopard death
tiger death
Prakasham district
Markapuram
railway accidents

More Telugu News