Chandrababu Naidu: నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Orders Completion of Paddy Procurement on Time
  • ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు
  • ధాన్యం కొనుగోళ్లు సహా వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
  • మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్లు సహకరించాలని సూచన
  • ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే పల్ప్ యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రైతులకు ప్రయోజనం చేకూరేలా రబీ - ఖరీఫ్ - రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

సచివాలయంలో ధాన్యం సేకరణ, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌పై నిన్న ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రబీ- ఖరీఫ్- రబీ సీజన్లలో ఏయే పంటలు వేయాలి, రైతులకు ఏది లాభదాయకం అనే విషయాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. పంట ఉత్పత్తుల నాణ్యతను పెంచడంతో పాటు, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని అన్నారు.

కోల్డ్ చైన్ వ్యవస్థతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను తరలించేందుకు, వాటి ప్రాసెసింగ్‌పై దృష్టి సారించాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేందుకు వీలుగా రైల్ కార్గో వంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు. వివిధ జిల్లాల్లో నిర్దేశించిన గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యలను పరిష్కరించి, రైతులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు సమీక్ష నుంచే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్‌తో ముఖ్యమంత్రి మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని సీఎం బ్యాంకర్లను ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ సమీక్షకు మంత్రులు కె. అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వర్చువల్‌గా హాజరయ్యారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
Paddy Procurement
Farmers Welfare
Crop Marketing
Rabi Season
Kharif Season
Bank Guarantee
Agriculture

More Telugu News