Asim Munir: ఆ సమయంలో మాకు దైవిక సాయం అందింది: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

Asim Munir claims divine help during Operation Sindoor
  • నేషనల్ ఉలెమా కాన్ఫరెన్స్ లో ఆసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు
  • దైవిక సాయాన్ని తాము ఫీల్ అయ్యామన్న మునీర్
  • పాక్ చిన్నారుల రక్తాన్ని ఆప్ఘనిస్థాన్ కళ్లజూస్తోందని మండిపాటు
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యతో పాక్ కు గట్టి దెబ్బ తగిలింది. మరోవైపు ఆనాటి పరిణామాలపై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ ఘర్షణ సమయంలో తమ దేశాన్ని 'దైవిక సాయం' కాపాడిందని ఆయన అన్నారు. ఇస్లామాబాద్ లో ఇటీవల జరిగిన నేషనల్ ఉలెమా కన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

భారత్ తో ఘర్షణ పడిన సమయంలో తమ సాయుధ బలగాలకు దైవిక సాయం అందిందని మునీర్ చెప్పినట్టుగా వీడియోల్లో ఉంది. ఆ సాయాన్ని తాము ఫీల్ అయ్యామని ఆయన చెప్పారు.

ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ తో ఘర్షణలపై కూడా ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ చిన్నారుల రక్తాన్ని ఆఫ్ఘనిస్థాన్ కళ్లజూస్తోందని మండిపడ్డారు. తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ ఉగ్రవాదుల్లో 70 శాతం ఆప్ఘనిస్థాన్ జాతీయులే ఉన్నారని ఆరోపించారు. ఆఫ్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఇకనైనా ఉగ్ర దాడులను ప్రోత్సహించడం మానుకోవాలని హితవు పలికారు. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని సైనిక స్థావరాలు, ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ భీకర దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ తో పాక్ తీవ్రంగా నష్టపోయింది.
Asim Munir
Pakistan
Operation Sindoor
Indian Army
Pahalgam Attack
ISI
Tehrik i Taliban Pakistan
Afghanistan
Jammu Kashmir
PoK

More Telugu News