ముష్కరుడిని ఎదిరించి మరణించిన వృద్ధ జంట.. బాండీ బీచ్ కాల్పుల మరో వీడియో వెలుగులోకి..!
- కారు పార్కింగ్ వద్ద గన్ మెన్ తో తలపడ్డ వృద్ధుడు
- ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలను బలిపెట్టిన వైనం
- తుపాకీ లాక్కునే క్రమంలో కిందపడ్డ వృద్ధుడు.. ముష్కరుడి చేతిలో మృతి
యూదుల వేడుకను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న సమయంలో బోరిస్, సోఫియా గుర్మన్ దంపతులు అక్కడే ఉన్నారు. బీచ్ నుంచి తిరిగి వెళ్లేందుకు కారు పార్కింగ్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఉగ్రవాదిని చూసి బోరిస్ ప్రాణాలకు తెగించి అతడితో పోరాడాడు. ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని అతడిపై తిరగబడేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఉగ్రవాదితో పాటు బోరిస్ కింద పడిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడ్డ ఉగ్రవాది వెంటనే తేరుకుని బోరిస్, సోఫియాలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రోడ్డు పక్కనే జరగడంతో అటుగా వెళుతున్న ఓ కారు డాష్ కెమెరాలో రికార్డైంది. ఉగ్రవాదితో వృద్ధుడు పోరాడుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.