Indian Railways: విమానాల రద్దుతో ప్రయాణికుల రద్దీ.. 89 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే

Indian Railways Announces 89 Special Trains Due to Flight Cancellations
  • విమానాల రద్దు, శీతాకాల ప్రయాణాల రద్దీని నియంత్రించేందుకు భారతీయ రైల్వే చర్యలు
  • రాబోయే మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా 89 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
  • వివిధ జోన్ల పరిధిలో 100కు పైగా ట్రిప్పులు నడపనున్న రైల్వే
  • విమానాల రద్దు, పెరిగిన డిమాండ్‌తో ప్రయాణికులకు ఉపశమనం
  • దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ పలు కీలక సర్వీసులు
శీతాకాల ప్రయాణాలు, ఇండిగో విమాన సర్వీసుల రద్దు కారణంగా పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు చేపట్టింది. రాబోయే మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా 89 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు వివిధ రైల్వే జోన్ల పరిధిలో 100కు పైగా ట్రిప్పులు న‌డ‌ప‌నుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణాలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రద్దీని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ రైల్వే 14, వెస్ట్రన్ రైల్వే 7 ప్రత్యేక సర్వీసులను ప్రకటించాయి. అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా పలు ప్రధాన నగరాల మధ్య అదనపు రైళ్లను నడుపుతున్నారు. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, పూణె, పాట్నా వంటి రద్దీ మార్గాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

దక్షిణ మధ్య రైల్వే కూడా శనివారం నుంచి మూడు ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. వీటిలో చర్లపల్లి - షాలిమార్, సికింద్రాబాద్ - చెన్నై ఎగ్మోర్, హైదరాబాద్ - ముంబై ఎల్‌టీటీ సర్వీసులు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో సాధారణ రైళ్లపై భారం తగ్గడంతో పాటు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ వెసులుబాటు లభిస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. వివిధ మార్గాల్లో ప్రకటించిన ఈ అదనపు సర్వీసులు ప్రయాణికులకు భారీ ఊరటనిస్తున్నాయి.
Indian Railways
Special Trains
Flight Cancellations
Passenger Rush
Winter Travel
Central Railway
South Central Railway
Mumbai
Delhi
Hyderabad

More Telugu News