LocalCircles: ఆన్‌లైన్ ఫుడ్‌కు అలవాటు పడుతున్న యువత.. సర్వేలో ఆందోళనకర అంశాల వెల్లడి!

Youth Increasingly Addicted to Online Food Says LocalCircles Survey
  • యువతలో వేగంగా మారుతున్న ఆహారపు అలవాట్లు
  • ఆన్‌లైన్‌లో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్డర్లకే మొగ్గు
  • ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అనారోగ్యకర ఆహారానికే ప్రాధాన్యం
  • భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్న నిపుణులు
దేశంలో యువత ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జనరేషన్-జెడ్ (జెన్-జెడ్) యువత ఇంటి భోజనానికి దూరమై, ఆన్‌లైన్‌లో లభించే ప్యాకేజ్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారని 'లోకల్ సర్కిల్స్' సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు (హెచ్ఎఫ్ఎస్ఎస్) ఉండే ఆహారాన్నే ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లు తేలింది.

దేశవ్యాప్తంగా 277 జిల్లాల్లో 24 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. అమెజాన్ ఫ్రెష్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వంటి ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఆహార పదార్థాల్లో 50 శాతానికి పైగా అల్ట్రా-ప్రాసెస్డ్, జంక్ ఫుడ్‌కు చెందినవే ఉంటున్నాయని సర్వే గుర్తించింది. ముఖ్యంగా బ్లింకిట్ (62 శాతం), జెప్టో (58 శాతం) వంటి యాప్‌లలో వీటి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్‌లో ఆహారం కొనుగోలు చేసే కుటుంబాల్లో 39 శాతం మంది.. తమ ఇంట్లోని యువతే ఎక్కువగా ఆర్డర్లు పెడుతున్నారని తెలిపారు. కేవలం 10-20 నిమిషాల్లోనే డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థల వల్ల ఈ ధోరణి మరింత పెరిగింది.

ఈ ఆహారపు అలవాట్ల వల్ల యువతలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థల ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఫుడ్ రెగ్యులేటరీ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కొవ్వు, చక్కెర, ఉప్పు వివరాలను స్పష్టంగా, పెద్ద అక్షరాలతో ముద్రించాలని, అనారోగ్యకర ఆహార విక్రయాలపై ఆన్‌లైన్ సంస్థలకు కఠిన నిబంధనలు విధించాలని వారు కోరుతున్నారు.
LocalCircles
Online food
Junk food
Ultra-processed food
HFSS foods
Generation Z
Youth
Food habits India
E-commerce food
FSSAI

More Telugu News