Sivaji Raja: అరుణాచలంలో భక్తుల తీరుపై నటుడు శివాజీ రాజా ఆవేదన.. నాశనం చేస్తున్నారంటూ ఫైర్

Sivaji Raja Expresses Grief Over Devotee Behavior in Arunachalam
  • 25 శాతం మంది దీన్ని వెకేషన్ ట్రిప్‌లా చూస్తున్నారని శివాజీ రాజా మండిపాటు
  • ఫొటోలు, వ్లాగ్స్‌తో స్థల పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన
  • కొందరి ప్రవర్తనతో మనసుకు బాధ కలిగిందన్న శివాజీ
సీనియర్ నటుడు శివాజీ రాజా అరుణాచలంలో కొందరు భక్తుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది భక్తితో కాకుండా, ఫొటోలు, వీడియోలు, వ్లాగ్స్ అంటూ అక్కడి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై శివాజీ రాజా మాట్లాడుతూ, "అరుణాచలం గురించి ఎక్కువ మందికి తెలియక ముందు నుంచే, గత 30 ఏళ్లుగా నేను నా కుటుంబంతో కలిసి వెళ్తున్నాను. మేం చాలా నిరాడంబరంగా దండం పెట్టుకుని వస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల తర్వాత తెలుగు భక్తుల రద్దీ పెరిగింది. అయితే, వీరిలో 75 శాతం మంది భక్తితో వస్తుంటే, మిగతా 25 శాతం మంది మాత్రం అరుణాచలాన్ని ఒక వెకేషన్ ట్రిప్‌లా భావిస్తున్నారు. వాళ్లు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే" అని అన్నారు.

రమణాశ్రమం వంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో కూడా కొందరు సెల్ఫీల కోసం అల్లరి చేస్తున్నారని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. "ఒకసారి నేను, నటుడు రాజా రవీంద్ర వెళ్లినప్పుడు కొంతమంది ఫొటోల కోసం గట్టిగా అరుస్తుంటే, అక్కడున్న విదేశీయులు వచ్చి నిశ్శబ్దంగా ఉండాలని హెచ్చరించారు. వెంకటేశ్, ఇళయరాజా వంటి ప్రముఖులు కూడా ఎంతో ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. కానీ కొందరి ప్రవర్తన అక్కడి పవిత్రతను దెబ్బతీస్తోంది. ఇది చూసి మనసుకు చాలా బాధగా ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే" అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం శివాజీ రాజా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా, చాలా మంది నెటిజన్లు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు.
Sivaji Raja
Arunachalam
Telugu Devotees
Chaganti Koteswara Rao
Ramana Ashramam
Raja Ravindra
Venkatesh
Ilaiyaraaja
spiritual tourism
temple tourism

More Telugu News