Nara Lokesh: దేవతల రాజధానిని దెయ్యాలు నాశనం చేయాలని చూశాయి: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Says Demons Tried to Destroy Amaravati
  • గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసింద‌న్న‌ లోకేశ్‌
  • 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల శంకుస్థాప‌న‌పై మంత్రి హ‌ర్షం
  • అమరావతిలో పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయని వ్యాఖ్య‌
  • కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రశంసలు కురిపించిన లోకేశ్‌
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణాలు జెట్ స్పీడ్‌లో సాగుతున్నాయని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. శుక్రవారం అమరావతిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 15 బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జ‌రిగిన శంకుస్థాపన కార్య‌క్ర‌మంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. రూ.1334 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు" అని ఆయన ఆరోపించారు. ఒక్క వ్యక్తి కోసం రూ.450 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. రైతులు మాత్రం 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' నినాదంతో పోరాడారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా 'జై అమరావతి' అంటూ ముందుకు సాగారని కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఈ రాజధానిని ఆపడం ఎవరి ఇంట్లో లైట్ స్విచ్ కాదని లోకేశ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న సహకారానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆమె నిరాడంబరతకు హ్యాట్సాఫ్ చెబుతూ, మంగళగిరి చేనేత వస్త్రాలను ధరించి వాటికి ప్రచారం కల్పించారని ప్రశంసించారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవడంలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంలో ఆమె కీలక పాత్ర పోషించారని వివరించారు.

రాజధానిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయనున్న ఈ 'బ్యాంక్ స్ట్రీట్' నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని లోకేశ్‌ తెలిపారు.
Nara Lokesh
Amaravati
Andhra Pradesh
Financial District
Capital City
Bank Street
Nirmala Sitharaman
Visakha Steel Plant
Polavaram Project
TDP

More Telugu News