Nirmala Sitharaman: దేశ ఆర్థిక వ్యవస్థను అమరావతికి తెచ్చారు: కేంద్ర మంత్రికి పయ్యావుల కృతజ్ఞతలు

Nirmala Sitharaman Brought National Economy to Amaravati Says Minister
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రశంసలు కురిపించిన పయ్యావుల కేశవ్
  • ఆమె కఠినంగా ఉన్నా అందులో అమ్మతనం చూశానన్న ఏపీ ఆర్థిక మంత్రి
  • సమయం వృధా చేస్తేనే నిర్మలమ్మకు కోపం వస్తుందని వ్యాఖ్య
  • ముఖ్యమంత్రి చంద్రబాబును టఫ్ హెడ్మాస్టర్‌తో పోల్చిన పయ్యావుల
  • డబుల్ ఇంజిన్ సర్కార్ విజయవంతంగా నడవడానికి ఆమే కారణమని కితాబు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశంసల వర్షం కురిపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఆమే అసలైన ఇంధనమని, ఆమె సహకారంతోనే ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అమరావతిలో పలు జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. "ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక్కరే రాలేదు, తనతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అమరావతికి తీసుకొచ్చారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకులు, ఎల్ఐసీ వంటి సంస్థల అధిపతులు ఇక్కడ ఉండటమే దీనికి నిదర్శనం. ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ముంబై... ఇప్పటినుంచి ఆ ఆర్థికకేంద్రం అమరావతి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు" అని వ్యాఖ్యానించారు.

నిర్మలా సీతారామన్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆమె పనితీరును పయ్యావుల ప్రత్యేకంగా వివరించారు. "ఆమె చాలా కఠినమైన వారని అంటారు, కానీ ఆ కఠినత్వం ఒక తల్లిలో ఉండే ప్రేమ లాంటిది. ఇంట్లో అమ్మ కఠినంగా లేకపోతే పిల్లలు సరైన దారిలో ఉండరు. రాష్ట్ర ప్రయోజనాలకు, ఆర్థిక క్రమశిక్షణకు విఘాతం కలిగితేనే ఆమె కఠినంగా వ్యవహరిస్తారు. సమయాన్ని వృథా చేస్తే ఆమెకు తీవ్రమైన కోపం వస్తుంది. ఏ సమావేశానికైనా సంపూర్ణ అవగాహనతో, పూర్తి హోంవర్క్‌తో వస్తారు. పోలవరం అంశంపై ఆమెకున్న పట్టు చూసి నేను ఆశ్చర్యపోయాను" అని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక 'టఫ్ హెడ్‌మాస్టర్' లాంటి వారని, ఆయన దగ్గర ప్రతిరోజూ తమకు పరీక్షేనని పయ్యావుల అన్నారు. "డే స్కాలర్స్‌గా ఉన్న మా పరిస్థితే ఇలా ఉంటే, ఇంట్లో ఉండే నారా లోకేశ్ గారి పట్ల ఆయన ఇంకెంత కఠినంగా ఉంటారో అని మేము అనుకునేవాళ్ళం. కానీ దాని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం. లోకేశ్ పరివర్తన, ఆయన ఎదుగుతున్న తీరు చంద్రబాబు నాయకత్వ పటిమకు నిదర్శనం" అని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు నిర్మలా సీతారామన్ ఆచరణ రూపం ఇస్తున్నారని పయ్యావుల కొనియాడారు. "జీఎస్టీ సంస్కరణలను బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రమే ప్రారంభించి, నెలరోజుల్లో అమలు చేయడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి, నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రం తరఫున రుణపడి ఉంటాం" అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్, పలువురు బ్యాంకుల ఛైర్మన్లు, ఎండీలు పాల్గొన్నారు.
Nirmala Sitharaman
Andhra Pradesh
Payyavula Keshav
Chandrababu Naidu
Amaravati
AP Economy
National Banks
LIC
Narendra Modi
Double Engine Government

More Telugu News