T20 World Cup 2026: ఉప్పల్, చిన్నస్వామి స్టేడియంలకు షాక్.. టీ20 వరల్డ్ కప్‌కు దూరం.. వివాదాలే కారణమా?

Uppal Chinnaswamy Stadium Not Selected for T20 World Cup
  • 2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
  • భారత్‌లో ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ వేదికలు
  • వేదికల జాబితాలో ఉప్పల్, చిన్నస్వామి స్టేడియాలకు దక్కని చోటు
  • హెచ్‌సీఏలో వివాదాలే ఉప్పల్‌కు శాపంగా మారిన వైనం
  • భద్రతా కారణాలు, తొక్కిసలాట ఘటనతో బెంగళూరుకు మొండిచేయి
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదలైంది. అయితే, ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీకి ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సాధారణంగా ఐసీసీ ఈవెంట్లకు వేదికలుగా నిలిచే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాలను ఈసారి పక్కన పెట్టడం వెనుక బలమైన కారణాలున్నాయి.

ఉప్పల్‌కు హెచ్‌సీఏ అవినీతి మరక.. 
గత కొంతకాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అవినీతి ఆరోపణలు, అంతర్గత వివాదాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ 18వ సీజన్‌లో టికెట్ల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో హెచ్‌సీఏ అప్పటి అధ్యక్షుడు గొడవపడటం, సీఈఓ కావ్య మారన్ బీసీసీఐకి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు హెచ్‌సీఏ ప్రతిష్ఠ‌ను దెబ్బతీశాయి. ఈ వివాదాల నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంకు అవకాశం ఇవ్వడానికి బీసీసీఐ, ఐసీసీ వెనుకాడినట్లు తెలుస్తోంది.

చిన్నస్వామికి తొక్కిసలాట ఎఫెక్ట్..
మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం భద్రతా కారణాల వల్ల అవకాశం కోల్పోయింది. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా ఆర్సీబీ నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెంద‌డం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్, స్టేడియం నిర్మాణంలో లోపాలున్నాయని, ఇది సురక్షితం కాదని నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు ఈ స్టేడియానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) జారీ చేయడం లేదు. ఈ కారణాలతోనే ఈ రెండు కీలక వేదికలను వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేయలేదని సమాచారం.
T20 World Cup 2026
Uppal Stadium
Chinnaswamy Stadium
Hyderabad Cricket Association
HCA
BCCI
IPL
Kavya Maran
RCB
Cricket Stadiums India

More Telugu News