Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. భయాందోళనల్లో ఉద్యోగులు

Tirumala Leopard Creates Panic Among Employees
  • ఎస్‌వీ యూనివర్సిటీ ఉద్యోగుల క్వార్టర్స్ వద్ద కలకలం
  • కోళ్ల షెడ్డుపై దాడికి యత్నం.. సీసీటీవీలో రికార్డు
  • రంగంలోకి దిగిన అటవీ, టీటీడీ విజిలెన్స్ బృందాలు
తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నివాస సముదాయం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఓ చిరుత సంచరించింది. అక్కడి కోళ్ల షెడ్డుపై దాడికి యత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి.
 
స్థానికుల కథనం ప్రకారం.. ఉద్యోగుల నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్దిసేపు అక్కడే తచ్చాడి, ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ..  ప్రత్యేక బృందాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.
 
అయితే, చిరుత సంచారంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భయంగా ఉందని, రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించే వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఉద్యోగులతో పాటు భక్తులు, స్థానికులు టీటీడీని కోరుతున్నారు. గత కొంతకాలంగా తిరుమలలో చిరుతల సంచారం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
Tirumala
Tirumala leopard
Sree Venkateswara University
TTD
Tirumala wildlife
Leopard attack
Wildlife
Andhra Pradesh
Forest department
Tirupati

More Telugu News