Devji alias Thippiri Tirupati: మావోయిస్టు అగ్రనేతలపై హైకోర్టులో పిటిషన్.. పోలీసుల అదుపులో ఉన్నారా?

High Court Petition Filed Alleging Detention of Maoist Leaders Devji Malla Raji Reddy
  • మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిపై హైకోర్టులో పిటిషన్
  • నవంబర్ 18నే వారిని పోలీసులు నిర్బంధించారని ఆరోపణ
  • ఏవోబీలో ఇద్దరు నేతల కోసం కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్
  • హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఆపరేషన్ ముమ్మరం చేసిన బలగాలు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం కలకలం రేపుతోంది. తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 18నే భద్రతా బలగాలు వారిని నిర్బంధంలోకి తీసుకున్నాయని, వారిని కోర్టులో ప్రవేశపెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది.

ప్రస్తుతం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో వీరిద్దరి కోసమే భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా, ఆయన భార్య, అంగరక్షకులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ను వేగవంతం చేసింది.

ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న అఖిల భారత డీజీపీల సమావేశం నాటికి మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మావోయిస్టు అగ్రనేతలను లొంగిపోయేలా చేసేందుకు తెలంగాణ ఎస్‌ఐబీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తోంది. కాగా, హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రేపటి విచారణ తర్వాత ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Devji alias Thippiri Tirupati
Malla Raji Reddy
Maoist leaders
Andhra Pradesh High Court
Telangana SIB
AOB
Anti-Maoist operations
Operation Kagar
DGP conference
Naxalites

More Telugu News