World Health Organization: గతేడాది 31 కోట్ల మంది మహిళలపై లైంగిక దాడులు!

World Health Organization reports 310 million women faced sexual assault last year
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు హింసకు బాధితులే
  • రెండు దశాబ్దాలుగా హింస నివారణలో పురోగతి నామమాత్రం
  • భాగస్వామి చేతిలో 1.25 కోట్ల మంది బాలికలు హింసకు గురి
మహిళలపై హింస ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా కొనసాగుతోందని, ఈ సమస్య పరిష్కారంలో గత రెండు దశాబ్దాలుగా చెప్పుకోదగ్గ పురోగతి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 25న అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విడుదల చేసిన నివేదికలో అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది.

గడిచిన 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 31.6 కోట్ల మంది మహిళలు, 1.25 కోట్ల మంది కౌమార బాలికలు లైంగిక హింసకు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు (దాదాపు 84 కోట్ల మంది) తమ జీవితకాలంలో భాగస్వామి ద్వారా గానీ, ఇతరుల వల్ల గానీ హింసను ఎదుర్కొన్నారని, 2000 సంవత్సరం నుంచి ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదని నివేదిక పేర్కొంది.

15-19 ఏళ్ల వయసున్న బాలికల్లో 16 శాతం మంది (1.25 కోట్లు) తమ భాగస్వామి చేతిలో శారీరక లేదా లైంగిక హింసకు గురైనట్లు తేలింది. భాగస్వామి ద్వారా జరిగే హింసను తగ్గించడంలో పురోగతి చాలా నెమ్మదిగా ఉందని, గత 20 ఏళ్లలో ఏటా కేవలం 0.2 శాతం మాత్రమే తగ్గిందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. భాగస్వాములు కాకుండా ఇతరుల వల్ల 15 ఏళ్ల వయసు నుంచి 26.3 కోట్ల మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారని, అయితే సామాజిక అపవాదు, భయం కారణంగా కొందరు వెల్లడించరని, దాని వల్ల ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

"మహిళలపై హింస మానవాళి ఎదుర్కొంటున్న పురాతన, విస్తృతమైన అన్యాయాలలో ఒకటి. అయినా దీనిపై చర్యలు చాలా తక్కువగా ఉన్నాయి. జనాభాలో సగం మంది భయంతో జీవిస్తున్న ఏ సమాజాన్నీ సురక్షితమైనదిగా పిలవలేం" అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, నివారణ కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని, బాధితులకు అండగా నిలిచే వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పిలుపునిచ్చింది.
World Health Organization
WHO
women violence
sexual assault
domestic violence
gender based violence
human rights violation
violence against women
Tedros Adhanom Ghebreyesus

More Telugu News