BR Gavai: కేంద్రంపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఫైర్

CJI BR Gavai Criticizes Center Over Laws Against Court Verdicts
  • కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు తేవడంపై అసహనం
  • పార్లమెంట్ కు ఆ అధికారం లేదన్న చీఫ్ జస్టిస్
  • ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టాన్ని తప్పుబట్టిన సీజేఐ
కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకురావడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. కోర్టు తీర్పులను పక్కనబెట్టే అధికారం పార్లమెంట్ కు లేదని పేర్కొంది. ఈమేరకు 2021 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టంతో ఫిల్మ్ సర్టిఫికేషన్ ట్రైబ్యునల్‌తో పాటు పలు ట్రైబ్యునళ్లు రద్దయ్యాయని మద్రాస్ బార్ అసోసియేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టం అమలును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో న్యాయస్థానం కొట్టివేసిన చట్టాలకు.. వాటి నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి కొత్త చట్టాలు తీసుకురావడం రాజ్యంగ విరుద్ధమని అన్నారు. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కోరగా.. సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసు ప్రాధాన్యతను బట్టి అవసరమైతే తామే విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తామని చెప్పారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది విచారణకు వాయిదా కోరగా సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను పదవీ విరమణ పొందే వరకూ ఈ కేసులో తీర్పు రావద్దని కోరుకుంటున్నారా?’ అంటూ ప్రభుత్వ న్యాయవాదిని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కోర్టు తీర్పులను ఉల్లంఘించడం సరికాదని పేర్కొంటూ.. ట్రైబ్యునళ్ల సంస్కరణ 2021 చట్టంలోని కీలక నిబంధనలను కొట్టివేస్తూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తీర్పు వెలువరించారు.
BR Gavai
Chief Justice of India
Tribunal Reforms Act 2021
Supreme Court
court rulings
parliament
Madras Bar Association
film certification tribunal
constitution

More Telugu News