Haryana wedding attack: పెళ్లి వేడుకలో రచ్చ.. మహిళా డ్యాన్సర్‌పై కర్రలతో దాడి.. వీడియో ఇదిగో!

Haryana Wedding Dancer Attacked in Nuh District Video Viral
  • తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అడ్డు చెప్పిన డ్యాన్సర్ పై కర్రలతో స్టేజ్‌పైనే దాడి, 
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • తమ వృత్తిలో ఎదురవుతున్న వేధింపులపై గళమెత్తిన ఇతర కళాకారులు
హర్యానాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో దారుణం చోటుచేసుకుంది. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న ఒక కళాకారిణి పట్ల వరుడి బంధువు అసభ్యంగా ప్రవర్తించగా, ఆమె అడ్డుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నెల 16న నూహ్ జిల్లా పచ్‌గావ్ గ్రామంలో ఒక ప్రీ-వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో కొందరు కళాకారులు నృత్య ప్రదర్శన ఇస్తున్నారు. ఈ క్రమంలో వరుడి బంధువు ఒకరు డబ్బులు ఇస్తున్నట్లు నటిస్తూ ఒక డ్యాన్సర్ వద్దకు అసభ్యకరంగా చేతులు తీసుకురావడంతో, ఆమె అతని చేతిని పక్కకు నెట్టింది. దీనిని అవమానంగా భావించిన ఆ వ్యక్తి వెంటనే ఆమెపై చేయి చేసుకున్నాడు.

ఆ తర్వాత మరికొందరు వ్యక్తులు స్టేజ్‌పైకి దూసుకొచ్చి ఆ డ్యాన్సర్‌ను కిందపడేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన తోటి కళాకారులపై కూడా దాడి చేశారు. చివరికి, వారి బృందంలోని సభ్యులు, అక్కడున్న కొందరు మహిళలు జోక్యం చేసుకుని వారిని సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

ఈ దాడి ఘటనపై పలువురు కళాకారులు తీవ్రంగా స్పందించారు. వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న డ్యాన్సర్‌ను అభినందిస్తూ తమ వృత్తిలో ఇలాంటి అవమానాలు సర్వసాధారణమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. "ఆ కళాకారులను కించపరచవద్దు. వారు కూడా ఎవరో ఒకరి సోదరీమణులు, కుమార్తెలే" అని నూహ్‌కు చెందిన డ్యాన్సర్ బిల్లి అన్నారు. పొట్టకూటి కోసం తాము ప్రదర్శనలు ఇస్తే, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సరికాదని మరో కళాకారిణి రేణు జంగ్రా ప్రశ్నించారు.
Haryana wedding attack
Nuh district
wedding dancer
assault video
pre wedding celebration
Renu Jangra
Billi dancer
Pachgaon village
crime news
social media viral

More Telugu News