Joggu Ramanna: బీజేపీ ఎంపీ ఇంటిని ముట్టడించిన బీఆర్ఎస్.. జోగు రామన్న అరెస్ట్‌తో ఉద్రిక్తత

BRS Protest at BJP MP House
  • పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలపై బీఆర్ఎస్ నిరసన
  • తేమ పేరిట కొనుగోళ్లు నిరాకరించడంపై నేతల ఆగ్రహం
  • ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనాలని డిమాండ్
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ భగ్గుమంది. ఈ విధానాలను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు బీజేపీ ఎంపీ నగేశ్ ఇంటిని ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ నగేశ్ నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సీసీఐ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం మాజీ మంత్రితో పాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. తేమ పేరు చెప్పి పత్తి కొనుగోళ్లను సీసీఐ నిరాకరిస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందని మండిపడ్డారు. తేమతో సంబంధం లేకుండా పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే వర్షాలతో రైతులు నష్టపోయారని, ఈ సమయంలో సీసీఐ పరిమితులు విధించడం సరికాదని అన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్లు కాకుండా, 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై సుంకం తగ్గించి, దేశీయ రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జోగు రామన్న ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. 
Joggu Ramanna
BRS protest
BJP MP Nagesh
CCI cotton purchases
Telangana farmers
Cotton Corporation of India
Cotton procurement
Farmers protest Telangana
Telangana politics
Cotton import duty

More Telugu News