Ram Charan: 'చికిరి' అంటే ఏంటి?.. రామ్ చరణ్ 'పెద్ది' ఫస్ట్ సింగిల్ వెనుక ఆసక్తికర కథ!

Ram Charan Peddi First Single Chikiri Interesting Story
  • రామ్ చరణ్ 'పెద్ది' నుంచి రానున్న తొలి పాట 'చికిరి'
  • పాట పుట్టుక వెనుక కథను వివరించిన దర్శకుడు బుచ్చిబాబు
  • 'చికిరి' పదాన్ని హుక్ లైన్‌గా మార్చిన ఏఆర్ రెహమాన్
  • పల్లెటూరిలో అందమైన అమ్మాయిని చికిరి అంటారని వెల్లడి
  • నవంబర్ 7న పూర్తి పాట విడుదల
  • 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. 'చికిరి చికిరి' అంటూ సాగే ఈ పాట పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికర సంభాషణను వివరిస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో దర్శకుడు బుచ్చిబాబు జరిపిన సంభాషణ ఈ వీడియోలో ఉంది. 'పెద్ది' ఫస్ట్ షాట్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, ఇప్పుడు సెకండ్ షాట్ రూపంలో తొలి పాటను సిద్ధం చేయాలని బుచ్చిబాబు కోరారు. పాట సిచ్యుయేషన్ గురించి రెహమాన్ అడగ్గా, పల్లెటూళ్లలో కాటుక అవసరం లేని అందమైన కళ్లు... ముక్కుపుడక అక్కర్లేరి తీరైన ముక్కు కలిగి ఉన్న అందమైన అమ్మాయిని 'చికిరి' అని పిలుస్తారని బుచ్చిబాబు వివరించారు. అలాంటి అమ్మాయిని హీరో చూసే సన్నివేశం అని రెహమాన్ క విడమర్చి చెప్పారు. అయితే 'చికిరి' అనే పదం రెహమాన్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. "చికిరి అంటే ఏమిటి?" అని అడిగి తెలుసుకున్న ఆయన, ఆ పదాన్నే హుక్ వర్డ్‌గా చేసుకుని ట్యూన్ కడతానని చెప్పారు.

ఈ సందర్భంగా బుచ్చిబాబు తన చిన్ననాటి జ్ఞాపకాలను రెహమాన్‌తో పంచుకున్నారు. తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు తన కజిన్ బాబీ ఇచ్చిన 'బొంబాయి' సినిమా పాటల క్యాసెట్ విన్నప్పటి నుంచి ఆయనకు పెద్ద అభిమానిని అయ్యానని తెలిపారు. 'పెద్ది' కథ ఫైనల్ అయ్యాక సంగీత దర్శకుడిగా మరో ఆలోచన లేకుండా రెహమాన్‌నే ఎంచుకున్నట్లు బుచ్చిబాబు తన మనసులోని మాటను బయటపెట్టారు.

ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ ఆలపించిన 'చికిరి చికిరి' పూర్తి పాటను నవంబర్ 7న విడుదల చేయనున్నారు. ఇక 'పెద్ది' సినిమాను 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Ram Charan
Peddi
Buchi Babu Sana
AR Rahman
Chikiri Chikiri Song
Telugu Movie
Mythri Movie Makers
Sukumar Writings
Mohit Chauhan
Telugu Cinema

More Telugu News