Delhi Pollution: ఢిల్లీ వాయు కాలుష్యం... భారత్‌కు సహాయం చేసేందుకు సిద్ధమన్న చైనా

Delhi Pollution China Offers Help to India
  • ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో 400 పాయింట్లు దాటిన గాలి నాణ్యత సూచి
  • గాలి నాణ్యత దిశగా గణనీయ విజయాలు సాధించిన చైనా
  • భారత్ సమస్య పరిష్కారానికి సహకరిస్తామని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి ట్వీట్
ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాలు తీవ్రమైన వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) గణాంకాల ప్రకారం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 మార్కును దాటింది.

గాలి నాణ్యతను మెరుగుపరచడంలో చైనా గణనీయమైన విజయాలు సాధించిందని, ఈ విషయంలో భారత్‌కు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు.

ఒకప్పుడు తమ దేశం కూడా తీవ్రమైన పొగమంచుతో ఇబ్బంది పడిందని, అలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారితో తమ అనుభవాలను పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని యూజింగ్ పేర్కొన్నారు. భారత్ త్వరలోనే ఈ పరిస్థితి నుంచి బయటపడుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

గతంలో పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా, గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఒకప్పుడు బీజింగ్‌తో పాటు పలు చైనా నగరాలు, పారిశ్రామిక కేంద్రాల్లో కాలుష్యం తీవ్రంగా ఉండేది. దీనిని గుర్తించినా చైనా ప్రభుత్వం కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టింది. గాలి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించి వాటిని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన జరిమానాలు విధించడంతో పాటు శిక్షలు కూడా అమలు చేసింది. ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.

కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో చైనా వేగంగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లింది. విద్యుత్ వాహనాలు, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిపై భారీగా పెట్టుబడులు పెట్టింది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న సమయాల్లో కాలుష్య కారక కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేయడంతో పాటు కొన్ని కర్మాగారాలను పట్టణాలు, నగరాలకు దూరంగా తరలించింది. ఈ చర్యల ద్వారా పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది. ఢిల్లీతో సహా భారత్‌లోని నగరాల్లో కూడా చైనా తరహా కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి మెరుగుపడుతుందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.
Delhi Pollution
China
Air Quality
India
Air Pollution
CPCB
Beijing
Renewable Energy
Yujiang

More Telugu News