రేవంత్ రెడ్డి సవాల్‌పై కిషన్ రెడ్డి ఘాటు స్పందన
- ముందు ఆరు గ్యారంటీల అమలుపై చర్చకు రావాలని కిషన్ రెడ్డి డిమాండ్
- కాళేశ్వరం విచారణ తమ ఎన్నికల హామీ కాదని వ్యాఖ్య
- తమపై అనవసర ఆరోపణలు మానుకోవాలని రేవంత్‌కు హితవు
- కేసీఆర్, హరీశ్‌ను అరెస్ట్ చేయాలంటూ గతంలో సవాల్ విసిరిన సీఎం
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముదిరిన మాటల యుద్ధం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై చర్చకు సిద్ధమా? కాళేశ్వరం కేసుపై విచారణ జరిపిస్తామని మేం ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు. ముందు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. ఆ తర్వాత మిగతా విషయాలు చర్చిద్దాం" అని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావులను సీబీఐ అరెస్ట్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీలోగా వారిద్దరినీ సీబీఐతో అరెస్ట్ చేయించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
ఈ ఆరోపణల నేపథ్యంలోనే కిషన్‌రెడ్డి పైవిధంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి.