Siddaramaiah: సీఎం కుర్చీ కోసం కర్ణాటకలో కాంగ్రెస్ ఆట.. బీజేపీ వ్యంగ్య పోస్టు

Karnataka Congress CM Post Musical Chairs Game Mocked by BJP
  • ఏఐ జెనరేటెడ్ వీడియో షేర్ చేసిన బీజేపీ
  • నవంబర్ విప్లవం కోసం కౌంట్ డౌన్ మొదలైందంటూ క్యాప్షన్
  • కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందన్న వార్తలపై బీజేపీ ఎద్దేవా
కర్ణాటక ప్రభుత్వంలో ‘నవంబర్ విప్లవం’ చోటుచేసుకోనుందని, దీనికోసం ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైందని బీజేపీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ‘మ్యూజికల్ చెయిర్’ ఆట ఆడుతున్నారని ఎద్దేవా చేసింది. ఈ నెలతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తికావొస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర తాత్సారం చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి పీఠం కోసం సీనియర్ నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు పట్టుబట్టడం వల్లే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో హైకమాండ్ మధ్యేమార్గంగా చెరో రెండున్నర సంవత్సరాలు సీఎం సీటును పంచుకోవాలంటూ ఇరువురు నేతలకు రాజీ కుదర్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా రెండున్నర సంవత్సరాలు పూర్తికావొస్తుండడంతో ఈ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి మార్పు జరగనుందని తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్ కు అప్పగిస్తారని కర్ణాటకకు చెందిన కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే, సీఎం కుర్చీని వదులుకునేందుకు సిద్దరామయ్య అంగీకరించడంలేదని, పూర్తికాలం తానే పదవిలో కొనసాగుతానని పేచీ పెడుతున్నారని సమాచారం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వస్తే తాను సూచించిన వ్యక్తికే సీఎం కుర్చీ అప్పగించాలని హైకమాండ్ ఎదుట డిమాండ్ పెట్టినట్లు సమాచారం. ఈ వార్తలపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. కర్ణాటకలో ప్రభుత్వ పెద్దలు ప్రజల సమస్యలను పక్కన పెట్టి కుర్చీ కోసం కొట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు మ్యూజికల్ చెయిర్ ఆట ఆడుతున్నారని ఆరోపించింది. ఏఐ సాయంతో ఓ వీడియో తయారు చేసి పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Siddaramaiah
Karnataka politics
DK Shivakumar
Congress party
Chief Minister post
BJP criticism
Musical chair game
Power struggle
November revolution
Karnataka government

More Telugu News