Mantry Shyam: హైదరాబాద్‌లో రియల్టర్ కిడ్నాప్ కేసు... మాజీ భార్య సహా 10 మంది అరెస్టు

Mantry Shyam Kidnapping Case Wife Arrested in Hyderabad
  • హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో రియాల్టర్ మంత్రి శ్యామ్ కిడ్నాప్
  • రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించడంతో కిడ్నాప్‌కు ప్లాన్ చేసిన మాజీ భార్య
  • కిడ్నాప్ అయ్యాక చాకచక్యంగా స్నేహితుడికి ఫోన్ చేసిన మంత్రి శ్యామ్
  • వెంటనే స్పందించి శ్యామ్‌ను కాపాడిన పోలీసులు
భర్తను కిడ్నాప్ చేసిన కేసులో ఒక మహిళతో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిని మాధవీలతగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఇటీవల రియల్టర్ శ్యామ్ కిడ్నాప్ కలకలం రేపింది. అక్టోబర్ 29న అంబర్‌పేట డీడీ కాలనీలో ఈ ఘటన జరిగింది. తన భర్త శ్యామ్ రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించడంతో ఆగ్రహించిన మాజీ భార్య మాధవీలత కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంత్రి శ్యామ్ అమెరికాలో నివసిస్తున్న సమయంలో మాధవీలతను వివాహం చేసుకున్నాడు. విభేదాలు రావడంతో మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. శ్యామ్ తన పేరును అలీగా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. తన తండ్రి నుంచి వచ్చిన రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని శ్యామ్ విక్రయించాడు. ఇది మాధవీలతకు ఆగ్రహం కలిగించింది.

దీంతో తన స్నేహితుడు సాయి సహాయంతో మాధవీలత మాజీ భర్త కిడ్నాప్‌కు పథకం రచించింది. మొత్తం 14 మంది సభ్యులతో కిడ్నాప్ ముఠా ఏర్పాటైంది. మాధవీలత సూచనలతో అక్టోబర్ 29న డీడీ కాలనీలో ఉంటున్న శ్యామ్ ఇంటికి వెళ్లి కిడ్నాప్ చేశారు. కిరాయికి తీసుకున్న రెండు కార్లలో శ్యాంను చెర్లపల్లి ప్రాంతానికి తీసుకు వెళ్లి, రూ. 1.5 కోట్లు డిమాండ్ చేశారు. శ్యాం తెలివిగా వ్యవహరించి తన స్నేహితుడికి ఫోన్ చేసి సహాయం కోరాడు.

ఆ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించడంతో, వేగంగా స్పందించిన పోలీసులు ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నారు.
Mantry Shyam
Hyderabad
kidnapping case
Madhavi Latha
Amberpet
DD Colony
property dispute

More Telugu News