Avinash Reddy: అవినాశ్ రెడ్డి కళ్లకు గంతలు కట్టుకున్నారా?: మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

Achchennaidu Fires at Avinash Reddy on Farmers Issues
  • రైతుల పేరుతో వైసీపీ డ్రామాలు చేస్తోందన్న మంత్రి అచ్చెన్నాయుడు
  • అవినాశ్ రెడ్డికి రైతులపై ఆకస్మిక ప్రేమ ఎందుకని నిలదీత
  • ఉల్లి రైతులకు హెక్టార్‌కు రూ.50,000 సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
  • వైసీపీ హయాంలో ఉల్లి రైతులకు దక్కింది కేవలం రూ.75 లక్షలేనని అచ్చెన్న విమర్శ
  • గత ఐదేళ్లుగా రైతుల సమస్యలు అవినాశ్ రెడ్డికి కనిపించలేదా అని ప్రశ్న
  • చంద్రబాబును విమర్శించే అర్హత అవినాశ్ రెడ్డికి లేదని వ్యాఖ్య
రైతుల పేరు చెప్పి వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. కడప జిల్లాలో రైతుల సమస్యలు పట్టించుకోని వైఎస్‌ అవినాశ్ రెడ్డికి ఇప్పుడు రైతులపై ఆకస్మికంగా ప్రేమ పుట్టుకురావడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉల్లి రైతులను ఆదుకునేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉల్లి రైతులకు హెక్టార్‌కు రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందిస్తున్నామని, దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రూ.104.57 కోట్ల లబ్ధి చేకూరుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులు పడిన ఇబ్బందులను అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. "2020లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి ధరలు పడిపోతే క్వింటాకు కేవలం రూ.770 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 129 మంది రైతుల నుంచి 970 మెట్రిక్ టన్నుల ఉల్లిని మాత్రమే కొనుగోలు చేసి, వారికి ఇచ్చింది కేవలం రూ.75 లక్షలు మాత్రమే. ఈ విషయం అవినాశ్ రెడ్డి గుర్తుంచుకోవాలి" అని ఆయన అన్నారు.

అంతకుముందు టీడీపీ హయాంలో ఉల్లి ధరలు తగ్గినప్పుడు, క్వింటాకు రూ.1200 వెచ్చించి కర్నూలు మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా రూ.17.22 కోట్ల విలువైన పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని తెలిపారు. "గత ఐదేళ్లుగా రైతుల సమస్యలు మీ కంటికి కనిపించలేదా? ఎన్నికలు, విపత్తులు వచ్చినప్పుడే వైసీపీ నేతలకు రైతులు గుర్తుకొస్తారా? ఐదేళ్లపాటు అవినాశ్ రెడ్డి కళ్లకు గంతలు కట్టుకున్నారా?" అని అచ్చెన్నాయుడు ఘాటుగా ప్రశ్నించారు. రైతుల నష్టపరిహారం ఫైళ్లు పెండింగ్‌లో ఉండటానికి గత ప్రభుత్వ గందరగోళ విధానాలే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత అవినాశ్ రెడ్డికి లేదని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.
Avinash Reddy
Achchennaidu
Andhra Pradesh
Onion Farmers
Subsidy
YSRCP
TDP
Chandrababu Naidu
Agriculture
Farmers Welfare

More Telugu News