Jagan Mohan Reddy: తుపాను బాధిత రైతులందరికీ పంట బీమా వర్తింపజేయాలి: జగన్

Jagan Demands Crop Insurance for Cyclone Affected Farmers
  • కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల పరామర్శ
  • కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులందరికీ తక్షణమే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ పథకం ద్వారానే ఉపశమనం లభిస్తుందని ఆయన అన్నారు.

మంగళవారం కృష్ణా జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్, పంట నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుపాను వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, కేవలం వరి పంటే 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం పంట నష్టం అంచనాలను తూతూమంత్రంగా చేపట్టిందని ఆరోపించారు. ఒక్క రోజులోనే లెక్కింపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని, కానీ క్షేత్రస్థాయిలో ఏ అధికారి పర్యటించలేదని 25 జిల్లాల రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు.

పంటల బీమాను రద్దు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని, దాని ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ విమర్శించారు. బీమా ప్రీమియం చెల్లించకపోవడం ప్రభుత్వ తప్పిదమే కాబట్టి, బకాయిపడ్డ రూ.600 కోట్లను ప్రభుత్వమే చెల్లించి, రాబోయే రబీ సీజన్‌కు కూడా ప్రీమియం కట్టాలని డిమాండ్ చేశారు. ఈ 18 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలనలో 16 సార్లు తుపానులు, కరవు వంటి విపత్తులు వచ్చినా రైతులకు అండగా నిలవలేదని మండిపడ్డారు.

"రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే, చంద్రబాబు ఏరియల్ సర్వే చేసి లండన్ వెళతారు... ఆయన కుమారుడు లోకేశ్ ఏమో ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూస్తారు.... రైతులను గాలికి వదిలేశారు" అని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రెండేళ్లుగా ఇస్తానన్న రూ.20,000 ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కేవలం రూ.5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

తమ ప్రభుత్వ హయాంలో ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాను సకాలంలో అందించామని గుర్తుచేశారు. "మేము అధికారంలో ఉన్నప్పుడు 85 లక్షల మంది రైతులకు ప్రీమియం చెల్లించాం. రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాం. మొత్తం రూ.78,000 కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. కానీ, ఈ ప్రభుత్వం కేవలం బ్యాంకు రుణాలు తీసుకున్న 19 లక్షల మందికి మాత్రమే బీమా వర్తింపజేసి మిగతా వారిని వదిలేసింది" అని జగన్ వివరించారు. ప్రభుత్వం ప్రీమియం చెల్లించడంలో విఫలమైనందున, నష్టపోయిన రైతులందరికీ బీమా మొత్తాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
Jagan Mohan Reddy
Crop Insurance
Cyclone Montha
Andhra Pradesh Farmers
TDP Government
Krishna District
Farmer Distress
Input Subsidy
Chandrababu Naidu
Agriculture Crisis

More Telugu News