Bihar Elections: బీహార్‌లో నేటితో ముగిసిన తొలి దశ ఎన్నికల ప్రచార పర్వం... ఎన్డీఏ ప్రభంజనం ఖాయమంటున్న బీజేపీ

Bihar Elections NDA Victory Claim After Phase 1 Campaign Ends
  • బీహార్ లో నవంబరు 6న తొలి దశ పోలింగ్
  • ఎన్డీఏ ప్రభంజనం ఖాయమంటున్న బీజేపీ
  • బీజేపీ, మిత్ర పక్షాల నేతల్లో ఉత్సాహం
బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. తొలి దశ ఎన్నికల పోలింగ్ నవంబరు 6న జరగడనుంది. ఈ దశలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా బలమైన గాలి వీస్తోందని, విజయం తమదేనని బీజేపీ పూర్తి ధీమా వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలను ప్రజలు సుపరిపాలన, అరాచక పాలన మధ్య పోరాటంగా చూస్తున్నారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా బీజేపీ నేత రోహన్ గుప్తా మాట్లాడుతూ.. "బీహార్‌లో పరిస్థితి స్పష్టంగా ఉంది. ఎన్డీఏకు అనుకూలంగా ప్రభంజనం కనిపిస్తోంది. ప్రజలు ఈ ఎన్నికలను 'జంగిల్ రాజ్', అభివృద్ధి మధ్య పోరుగా భావిస్తున్నారు. విజయం కచ్చితంగా అభివృద్ధి, సుపరిపాలనదే. 20 ఏళ్ల సుపరిపాలనను, అంతకుముందున్న 'జంగిల్ రాజ్'ను ప్రజలు చూశారు. ఆ చీకటి రోజులను వారెప్పటికీ మరిచిపోరు. ఎన్డీఏ హయాంలో కొనసాగుతున్న అభివృద్ధిని కొనసాగించాలని వారు కోరుకుంటున్నారు. 'జంగిల్ రాజ్'ను తిరస్కరించి, స్థిరత్వం కోసం ఎన్డీఏకు ఓటు వేస్తారు" అని ఆయన అన్నారు.

మరో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ... "మహాగట్‌బంధన్ ప్రచారంలో చాలా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేయడం లేదు. వారి తీరు చూస్తుంటే ఆర్జేడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే మహాగట్‌బంధన్ ప్రచారం దాదాపు కుప్పకూలింది. మరోవైపు ఎన్డీఏ చాలా శక్తివంతంగా, అద్భుతమైన ప్రచారం నిర్వహించింది," అని తెలిపారు.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాడియో మాట్లాడుతూ, "తొలి విడతలో 121 స్థానాలకు ప్రచారం ముగిసింది. సంపూర్ణ మెజారిటీ కోసం నిర్దేశించుకున్న లక్ష్యంలో మేము దాదాపు 70 శాతం చేరుకుంటామనే నమ్మకం ఉంది. ప్రధాని మోదీ, మా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ర్యాలీలలో ఎన్డీఏ గాలి స్పష్టంగా కనిపించింది. ప్రజలు తేజస్వి యాదవ్‌ను, 'జంగిల్ రాజ్'ను తిరస్కరించడానికి ఉత్సాహంగా ఉన్నారు" అని పేర్కొన్నారు.

బీహార్‌లోని 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ స్థానాలకు నవంబర్ 6న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరగనుంది. చివరి రోజున ఎన్డీఏ, మహాగట్‌బంధన్‌తో పాటు ఇతర పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు ర్యాలీలు, రోడ్‌షోలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి తుది ప్రయత్నాలు చేశారు.
Bihar Elections
Bihar Assembly Elections
NDA
BJP
Nitish Kumar
Tejashwi Yadav
Mahagathbandhan
Bihar Politics
Election Campaign

More Telugu News