Mandira Bedi: మహిళా క్రికెట్ జట్టుకు డబ్బులు లేనప్పుడు మందిరా బేడీ ఆ మొత్తాన్ని ఇచ్చేసింది: నూతన్ గవాస్కర్

Mandira Bedi Donated Funds to Womens Cricket Team Says Nutan Gavaskar
  • మహిళా జట్టును విదేశాలకు పంపించేందుకు డబ్బు లేని సమయంలో సాయం చేశారని వెల్లడి
  • మందిరా బేడీ వజ్రాల యాడ్ ప్రకటనకు అందుకున్న మొత్తం డబ్బును ఇచ్చారని వెల్లడి
  • మందిరా బేడీ చేసిన సాయం ఎప్పటికీ మరిచిపోలేమన్న నూతన్ గవాస్కర్
కొన్నేళ్ల క్రితం మహిళా క్రికెట్ జట్టును విదేశాలకు పంపించడానికి కనీసం టిక్కెట్‌కు కూడా డబ్బుల్లేని సమయంలో మందిరా బేడీ పరిస్థితిని అర్థం చేసుకుని ఓ వజ్రాల బ్రాండ్ ప్రకటనకు సంబంధించి తాను అందుకున్న మొత్తాన్ని విరాళంగా ఇచ్చారని సునీల్ గవాస్కర్ సోదరి, మాజీ క్రికెటర్ నూతన్ గవాస్కర్ వెల్లడించింది.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌ను అందుకోవడంతో వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్న ఈ జట్టుకు ఎంతోమంది తమ వంతు సాయం అందించారు. నటి, వ్యాఖ్యాత, ఫ్యాషన్ డిజైనర్ అయిన మందిరా బేడీ కూడా ఈ జట్టుకు తోడ్పాటును అందించింది. మహిళా జట్టును విదేశాలకు పంపించడానికి ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వద్ద డబ్బులు కూడా లేని సమయంలో మందిరా బేడీ సాయం చేశారని నూతన్ గవాస్కర్ గుర్తు చేసుకుంది.

మందిరా బేడీ చేసిన సాయం ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పింది. నూతన్ మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం మహిళా జట్టును విదేశాలకు పంపించడానికి కనీసం టిక్కెట్ డబ్బులు కూడా లేవని, అయినా జట్టులోని సభ్యులంతా ఆట మీద ప్రేమతో ఆడేవారని చెప్పింది. అలాంటి సమయంలో మందిరా బేడీ సహాయం చేశారని వెల్లడించింది.

ఒకరోజు మందిరా బేడీ కమర్షియల్ యాడ్ షూట్ జరుగుతుండగా అక్కడకి వెళ్ళామని, అక్కడ ఆమె ఒక వజ్రాల బ్రాండుకు సంబంధించిన ప్రకటనలో నటిస్తున్నారని, తాము అక్కడకి వెళ్లగానే ఆమెకు పరిస్థితి అర్థమైందని నూతన్ వెల్లడించింది. ప్రకటనకు సంబంధించి అప్పుడే అందుకున్న మొత్తాన్ని విరాళంగా ఇచ్చారని తెలిపింది. మందిరా బేడీ ఇచ్చిన డబ్బుతోనే ఇంగ్లండ్ పర్యటన కోసం విమాన టిక్కెట్లు కొన్నట్లు తెలిపింది.
Mandira Bedi
Indian Women's Cricket Team
Nutan Gavaskar
Womens Cricket Association of India

More Telugu News