Kranti Gaud: టీమిండియా మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ కు రూ.1 కోటి నజరానా

Kranti Gaud Awarded 1 Crore for World Cup Performance
  • మహిళల ప్రపంచకప్‌లో భారత్ చారిత్రక విజయం
  • జట్టు సభ్యురాలు క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా
  • రూ.1 కోటి నగదు బహుమతి ప్రకటించిన సీఎం మోహన్ యాదవ్
  • మెగా టోర్నీలో రాణించిన యువ పేసర్ క్రాంతి
  • ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌ను తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులోని కీలక సభ్యురాలికి భారీ నజరానా లభించింది. ఈ మెగా టోర్నీలో తన అద్భుత బౌలింగ్‌తో రాణించిన మధ్యప్రదేశ్‌కు చెందిన యువ పేసర్ క్రాంతి గౌడ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం స్వయంగా వెల్లడించారు.

ఆదివారం నవీ ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయం అనంతరం సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ, "నిన్న రాత్రి మన అమ్మాయిలు క్రికెట్‌లో అద్భుతాలు చేశారు. యావత్ దేశం గర్వపడేలా చేశారు. ఈ విజేత జట్టులో మన మధ్యప్రదేశ్ బిడ్డ క్రాంతి గౌడ్ కూడా ఉండటం మాకు గర్వకారణం. ఆమె అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.1 కోటి బహుమతిని ప్రకటిస్తున్నాను" అని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నట్లే, మహిళలు కూడా క్రీడల్లో సత్తా చాటుతున్నారని ఆయన కొనియాడారు.

బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని చతర్‌పూర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె తండ్రి ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్రికెట్‌పై మక్కువతో కఠోర సాధన చేసింది. చిన్నప్పుడు అబ్బాయిలతో కలిసి టెన్నిస్ బంతితో ఆడి, ఆ తర్వాత లెదర్ బాల్ క్రికెట్‌లో రాటుదేలింది. రైట్ ఆర్మ్ మీడియం పేసర్‌గా మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2025లో శ్రీలంకతో జరిగిన ట్రై-సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆమె, ఇంగ్లండ్ పర్యటనలో 52 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించింది. ప్రపంచకప్‌లో ఆమె ప్రదర్శన భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.
Kranti Gaud
Indian Women's Cricket
Women's Cricket World Cup
Mohan Yadav
Madhya Pradesh
Cricket Reward
South Africa
Narendra Modi
Indian Cricket Team
Women in Sports

More Telugu News