Kavitha: తేమ పేరుతో పత్తి రైతులను దోచుకుంటున్నారు: కవిత

Kavitha Slams Exploitation of Cotton Farmers in Telangana
  • సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కవిత ఆగ్రహం
  • సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ఆపి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు
  • తేమతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరకు పత్తి కొనాలని డిమాండ్
రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, తేమ పేరుతో కొనుగోలు కేంద్రాల్లో వారిని దారుణంగా మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల్లో అధికారులు సృష్టిస్తున్న ఇబ్బందుల వల్ల రైతులు గిట్టుబాటు ధర కోల్పోయి, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "తేమ సాకుతో సీసీఐ అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో దిక్కులేక రైతులు తమ పంటను ప్రైవేటుకు అమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతంలో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది" అని విమర్శించారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో ప్రచారం ఆపి, తక్షణమే రైతుల సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని గిట్టుబాటు ధరకు సీసీఐ కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అంతకుముందు ఆదిలాబాద్‌కు చేరుకున్న కవితకు తెలంగాణ జాగృతి నాయకులు, ఆదివాసీలు గుస్సాడీ నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రైతులు, ఆదివాసీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Cotton farmers
CCI
Cotton Corporation of India
Adilabad
Telangana
Farmers issues
MSP

More Telugu News