Kaleru Yadaiya: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటనా స్థలానికి వచ్చిన రాజకీయ నాయకుల ఘెరావ్

Chevella Accident Political Leaders Confronted by Victims Families
  • చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • బస్సు, టిప్పర్ ఢీకొని 19 మంది మృతి
  • ఘటనా స్థలికి చేరుకున్న రాజకీయ నాయకుల ఘెరావ్
  • రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదని ప్రజల ఆగ్రహం
  • నిరసనల మధ్యే వెనుదిరిగిన ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. 

ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రమాదం జరిగిన చాలాసేపటి తర్వాత ఎమ్మెల్యే కాలె యాదయ్య ఘటనా స్థలానికి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గతంలో ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ప్రజల నిరసనల మధ్యే ఎమ్మెల్యే కాలె యాదయ్య అక్కడి నుంచి వెనుదిరిగారు. 

అలాగే, చేవెళ్ల ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని బాధితులు ఘెరావ్ చేశారు. ఈ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ ప్రమాద తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
Kaleru Yadaiya
Chevella accident
Telangana road accident
Sabitha Indra Reddy
Visweshwar Reddy
Rohit Reddy
Road expansion works
Bus lorry collision
Rangareddy district
Telangana news

More Telugu News