ICC Women's World Cup 2025: విశ్వవిజేతలకు తారల ప్రశంసలు.. భారత మహిళల జట్టుకు చిరు, మహేశ్‌, క‌మ‌ల్‌ అభినందనలు

Indian Womens Cricket Team Congratulated by Chiranjeevi Mahesh Babu Kamal Haasan
  • మహిళల ప్రపంచకప్ 2025 గెలిచిన భారత జట్టు
  • టీమిండియాకు చిరంజీవి, మహేశ్‌ బాబు, కమల్ హాసన్ ప్ర‌శంస‌లు
  • కలలు కనే ప్రతి అమ్మాయి విజయం ఇదన్న మెగాస్టార్
  • ఇది మహిళల క్రికెట్‌లో 1983 లాంటి క్షణమన్న కమల్ హాసన్
  • ఇదొక అద్భుతమైన క్షణమ‌ని పేర్కొన్న మ‌హేశ్‌
భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025ను కైవసం చేసుకుంది. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, కమల్ హాసన్ వంటి దక్షిణాది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జట్టుకు తమ అభినందనలు తెలిపారు.

ఈ చారిత్రక విజయంపై మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "భారత క్రికెట్‌లో ఇదొక గర్వకారణమైన, చారిత్రకమైన రోజు. మహిళల ప్రపంచకప్‌లో సంచలన విజయం సాధించిన మన భారత మహిళల జట్టుకు అభినందనలు. కలలు కనడానికి సాహసించిన ప్రతి యువతి, వారిని నమ్మిన ప్రతి తల్లిదండ్రులు, గర్వంగా మద్దతు తెలిపిన ప్రతి అభిమాని విజయం ఇది. మీరు ఇలాగే రాణిస్తూ, అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగాలి. జై హింద్" అని చిరు పేర్కొన్నారు.

లోకనాయకుడు కమల్ హాసన్ ఈ విజయాన్ని 1983 ప్రపంచకప్‌తో పోల్చారు. "భారత మహిళల క్రికెట్‌లో 1983 లాంటి క్షణం వచ్చేసింది! మీ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. మీ స్ఫూర్తి లక్షలాది కలలకు నిప్పురవ్వ అవుతుంది. కంగ్రాట్స్, టీమిండియా!" అంటూ ఆయన ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కూడా తన సంతోషాన్ని పంచుకున్నారు. "ఇదొక అద్భుతమైన క్షణం. మువ్వన్నెల జెండా ఎప్పటికంటే ఎత్తున ఎగరడంతో చరిత్రలో గర్వించదగ్గ అధ్యాయం లిఖించబడింది. ఈ టోర్నమెంట్ ఆసాంతం భారత మహిళల జట్టు అసాధారణమైన సంయమనం, పట్టుదల ప్రదర్శించింది. ఈ ఛాంపియన్స్ క్షణం భారత్ అంటే ఏమిటో నిర్వచిస్తుంది" అని ఆయన తన పోస్టులో రాశారు.

అదేవిధంగా నటులు గోపీచంద్, మంచు మనోజ్ కూడా జట్టును అభినందించారు. "ప్రతిభ, పట్టుదల, ఎన్నడూ వదలకుండా పోరాడే స్ఫూర్తికి ఇది నిదర్శనం. భయంలేని క్రికెట్ ఎలా ఉంటుందో మన అమ్మాయిలు చూపించారు" అని గోపీచంద్ కొనియాడారు. 

"మహిళల జట్టు ప్రపంచకప్ సాధించి చరిత్ర సృష్టించింది. ఇది దేశం మొత్తం గర్వించదగ్గ క్షణం" అని మంచు మనోజ్ పేర్కొన్నారు. వీరితో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు భారత మహిళల జట్టు చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ICC Women's World Cup 2025
Harmanpreet Kaur
Indian Women's Cricket Team
Chiranjeevi
Mahesh Babu
Kamal Haasan
South Africa
Women's Cricket
Cricket World Cup
Indian Cricket

More Telugu News