Revanth Reddy: రంగారెడ్డి ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు

Revanth Reddy Shocked by Rangareddy Accident Orders Key Officials
  • సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన
  • గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు
  • ప్రమాదంపై మంత్రి పొన్నం, ఏపీ నేతలు పవన్, లోకేశ్ స్పందన
  • మృతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సానుభూతి
రంగారెడ్డి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలియగానే ఆయన తక్షణమే స్పందించి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఉన్నతాధికారులను సూచించారు.

క్షతగాత్రుల ప్రాణాలు కాపాడటమే ప్రథమ కర్తవ్యమని సీఎం స్పష్టం చేశారు. గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించి, అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరారు. బాధితుల కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పరిస్థితి విషమంగా ఉన్న వారిని కాపాడేందుకు నిపుణులైన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనను ఒక 'హెల్త్ ఎమర్జెన్సీ' తరహాలో పరిగణించి, అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రమాదంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకోవాలని ఆదేశించారు. మరోవైపు, ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు నారా లోకేశ్ పేర్కొన్నారు.
Revanth Reddy
Telangana
RangaReddy accident
Road accident
Pawan Kalyan
Nara Lokesh
Telangana government
Ponnam Prabhakar
RTC MD Nagireddy
Gandhi Hospital Osmania Hospital

More Telugu News