National Highway 67: రెండు నెలలకే జాతీయ రహదారికి పగుళ్లు.. కడప జిల్లాలో నిలిచిన రాకపోకలు

National Highway 67 Cracks in Kadapa Within Two Months
  • కడప జిల్లా మైదుకూరు-బద్వేలు సెక్షన్‌లో ఘటన
  • కొన్నిచోట్ల 500 మీటర్ల వరకు రోడ్డు రెండుగా చీలిపోవడంతో ఆందోళన
  • హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు
  • నిర్మాణ నాణ్యతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు, విమర్శలు
  • గతంలో అనంతపురం జిల్లాలోనూ ఇదే హైవేపై పగుళ్లు
ఏపీలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల రాకపోకలకు అనుమతించి కేవలం రెండు నెలలు కూడా గడవకముందే హైవేపై భారీ పగుళ్లు ఏర్పడి, రోడ్డు రెండుగా చీలిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాంనగర్‌ను కృష్ణపట్నం పోర్టుతో కలిపే 67వ జాతీయ రహదారిని ఇటీవల నిర్మించారు. ఇందులో భాగంగా కడప జిల్లా మైదుకూరు-బద్వేలు సెక్షన్‌లోని చాపాడు మండలం విశ్వనాథపురం నుంచి గడ్డంవారిపల్లె వరకు నిర్మించిన హైవేపై భారీ పగుళ్లు దర్శనమిచ్చాయి. మైదుకూరులోని పుల్లయ్యస్వామి సత్రం వద్ద పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కొన్ని చోట్ల ఏకంగా 500 మీటర్ల పొడవునా రోడ్డు చీలిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పగుళ్ల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే, ఆ ప్రాంతంలో 400 కేవీ విద్యుత్ వైర్లు ఉన్నందునే రాకపోకలు ఆపినట్లు చెబుతున్నారు. మరోవైపు, ఈ విషయంపై కాంట్రాక్టు సంస్థ స్పందించింది. రహదారి నిర్వహణ బాధ్యత తమకు 15 ఏళ్ల పాటు ఉందని, పగుళ్లను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చింది.

కాగా, ఈ జాతీయ రహదారిపై పగుళ్లు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోనూ ఇదే తరహాలో రోడ్డు దెబ్బతింది. అప్పుడు కూడా నాణ్యతపై విమర్శలు వచ్చాయి. సుమారు రూ. 630 కోట్ల వ్యయంతో గుత్తి నుంచి ఏపీ సరిహద్దు వరకు 55 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఇప్పుడు కడప జిల్లాలోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో నిర్మాణ నాణ్యతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2015-19 మధ్య పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఆలస్యం కాగా, ఇప్పుడు నాణ్యతా లోపాలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది.
National Highway 67
Kadapa district
Andhra Pradesh
Highway cracks
Road construction quality
Gutti Anantapur
Krishnapatnam Port
Ramnagar Karnataka
Road damage
Mydukuru Badvel

More Telugu News