Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ భారీ షాక్.. రూ.3,084 కోట్ల ఆస్తుల అటాచ్

Anil Ambani Faces ED Action Assets Worth Rs 3084 Crore Attached
  • ముంబైలోని నివాసంతో పాటు 40కి పైగా ఆస్తుల జప్తు
  • రిలయన్స్ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల మళ్లింపు ఆరోపణలు
  • యెస్ బ్యాంక్ నిధులను పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో గుర్తింపు
  • సెబీ నిబంధనలను తప్పించుకునేందుకు పక్కా ప్లాన్‌తో మోసం
  • రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లోనూ రూ.13,600 కోట్ల మోసాలు వెలుగులోకి
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్ఎఫ్ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్ఎల్) సంస్థల్లో ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆయనకు చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కి పైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, న్యూఢిల్లీలోని రిలయన్స్ సెంటర్‌తో పాటు పలు నివాస, వాణిజ్య భవనాలు, భూములు ఉన్నాయి. ఈ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో విస్తరించి ఉన్నాయి.

కేసు నేపథ్యం ఇదే..
2017-19 మధ్యకాలంలో యెస్ బ్యాంక్... ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌లో రూ.2,965 కోట్లు, ఆర్‌సీఎఫ్ఎల్‌లో రూ.2,045 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. అయితే 2019 డిసెంబర్ నాటికి ఈ పెట్టుబడులు నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారాయి. ఆర్‌హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ.1,353 కోట్లు, ఆర్‌సీఎఫ్ఎల్‌ నుంచి రూ.1,984 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

సెబీ నిబంధనల ప్రకారం... రిలయన్స్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ నేరుగా అనిల్ అంబానీ గ్రూప్ ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు ఉన్నాయి. ఈ నిబంధనలను అధిగమించేందుకు, మ్యూచువల్ ఫండ్లలోని ప్రజాధనాన్ని పరోక్షంగా యెస్ బ్యాంక్ ద్వారా ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌, ఆర్‌సీఎఫ్ఎల్‌ సంస్థలకు మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఈ ఆర్థిక సంస్థలు, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన ఇతర కంపెనీలకు రుణాలుగా అందించాయి.

చాలా సందర్భాల్లో ఎలాంటి తనిఖీలు లేకుండానే రుణాలను "స్పీడ్-ప్రాసెస్" చేశారని ఈడీ గుర్తించింది. దరఖాస్తు, మంజూరు, ఒప్పందం అన్నీ ఒకే రోజు జరిగిపోయాయని, కొన్నిసార్లు దరఖాస్తు చేయడానికి ముందే నిధులు విడుదలయ్యాయని దర్యాప్తులో వెల్లడైంది. దీనిని "ఉద్దేశపూర్వకమైన, స్థిరమైన నియంత్రణ వైఫల్యాలు"గా ఈడీ అభివర్ణించింది.

ఈడీ తన దర్యాప్తును రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్)కు కూడా విస్తరించింది. ఇందులో రూ.13,600 కోట్లకు పైగా "వ్యవస్థీకృత రుణ మోసాలు" జరిగినట్లు గుర్తించింది. ఈ మొత్తంలో రూ.12,600 కోట్లను అనుబంధ సంస్థలకు మళ్లించగా, మరో రూ.1,800 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా గ్రూప్ కంపెనీలకు తరలించారు. ఈ నేరంలో భాగమైన మరిన్ని ఆస్తులను గుర్తించే పని కొనసాగుతోందని, జప్తు చేసిన ఆస్తుల ద్వారా రికవరీ చేసిన మొత్తం చివరికి ప్రజలకే చెందుతుందని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.
Anil Ambani
Reliance Home Finance
Enforcement Directorate
ED
money laundering
assets attached
Yes Bank
Reliance Commercial Finance
financial fraud
loan defaults

More Telugu News