Divi Madhuri: బిగ్ బాస్ నుంచి దివ్వెల మాధురి ఔట్

Divi Madhuri Out From Bigg Boss Telugu Season 9
  • బిగ్ బాస్ సీజన్ 9 నుంచి నటి దువ్వాడ మాధురి ఎలిమినేషన్
  • రెండు వారాలకే ముగిసిన ఆమె బిగ్ బాస్ ప్రయాణం
  • వెళ్తూ వెళ్తూ కంటెస్టెంట్ భరణిపై సంచలన ఆరోపణలు
బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో మరో ఎలిమినేషన్ జరిగింది. నటి దువ్వాడ మాధురి కేవలం రెండు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో అత్యల్ప ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతో మాధురి షాక్‌కు గురయ్యారు.

ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో మాధురితో పాటు సంజన, రీతూ చౌదరి, కల్యాణ్‌, తనూజ, రాము, డిమోన్‌ పవన్‌, గౌరవ్‌ ఉన్నారు. ఓటింగ్ సరళిలో చివరి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ గౌరవ్‌, మాధురి మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే, చివరికి ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి తన ప్రయాణాన్ని ముగించాల్సి వచ్చింది.

హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను ఎలిమినేట్ అవుతానని ముందే ఊహించానని, అయితే నవంబర్ 4న తన భర్త శ్రీనివాస్ పుట్టినరోజు ఉండటంతో ఆ సమయంలో ఆయనతో ఉండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు.

ఇక హౌస్‌మేట్స్ గురించి మాట్లాడుతూ.. కల్యాణ్‌, డిమోన్ పవన్, తనూజ చాలా మంచివారని ప్రశంసించారు. అదే సమయంలో కంటెస్టెంట్ భరణిపై సంచలన ఆరోపణలు చేశారు. హౌస్‌లో ఉండేందుకు భరణికి ఎలాంటి అర్హత లేదని తేల్చి చెప్పారు. "అందరూ వెనుక నుంచి పొడిస్తే.. అతను మాత్రం సూటిగా పొడుస్తున్నాడు" అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వెళ్లారు. ఆమె కామెంట్లతో హౌస్‌లో ఉన్నవారి మధ్య సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.
Divi Madhuri
Bigg Boss Telugu Season 9
Bigg Boss Telugu
Akkineni Nagarjuna
Elimination
Telugu Reality Show
Srinivas
Bharani

More Telugu News