Penugonda: పెనుగొండ పేరు మార్పు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt Renames Penugonda as Vasavi Penugonda
  • పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పేరు మార్పు
  • ఇకపై 'వాసవీ పెనుగొండ'గా అధికారిక గుర్తింపు
  • ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు కూటమి సర్కార్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగొండ పేరును 'వాసవీ పెనుగొండ'గా మార్చాలని నిశ్చయించింది. ఆర్యవైశ్యుల చిరకాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ కానున్నాయి.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సవితతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ రాకేష్ నేతృత్వంలోని ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. పెనుగొండకు ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరిస్తూ, దాని పేరును వాసవీ పెనుగొండగా మార్చాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఆర్యవైశ్యుల వినతిని సానుకూలంగా పరిశీలించిన మంత్రి సవిత, ఈ మేరకు అక్కడే అధికారికంగా ప్రకటన చేశారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మించిన పెనుగొండ గ్రామానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఆర్యవైశ్యుల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. పేరు మార్పునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆర్యవైశ్యుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్యవైశ్య సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. 
Penugonda
Vasavi Penugonda
Andhra Pradesh
West Godavari
Arya Vysya
Savitamma
Chandrababu Naidu
Name Change
Temple Town

More Telugu News