Sangeetha: భర్తను నమ్మించి బయటకు తీసుకెళ్లి.. కత్తితో పొడిపించిన భార్య

Sangeetha Arranges Husbands Murder in Mysore With Brothers Help
  • కుటుంబ గొడవలతో భర్తను హత్య చేయించాలని చూసిన భార్య
  • సోదరుడు, స్నేహితులతో కలిసి దారుణానికి ప్లాన్
  • సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
  • భార్య, ఆమె సోదరుడితో పాటు నలుగురి అరెస్టు 
  • నిందితుల్లో 17 ఏళ్ల బాలుడు కూడా
కుటుంబంలో తరచూ జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కడతేర్చాలని దారుణానికి ఒడిగట్టింది. సొంత సోదరుడి సాయంతో భర్తపై హత్యాయత్నం చేయించిన ఈ ఘటన మైసూరులోని నంజనగూడులో కలకలం రేపింది. ఈ కేసులో భార్య సంగీత, ఆమె సోదరుడు సంజయ్‌తో పాటు మరో ఇద్దరిని నంజనగూడు పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఫైబర్ డోర్లు బిగించే పనిచేసే రాజేంద్ర, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సంగీత దంపతులు. వీరి మధ్య చిన్న చిన్న విషయాలకే తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని సంగీత నిర్ణయించుకుంది. ఇందుకోసం తన సోదరుడు సంజయ్, అతడి స్నేహితులు విఘ్నేశ్, 17 ఏళ్ల బాలుడితో కలిసి కుట్ర పన్నింది.

పథకం ప్రకారం అక్టోబరు 25న సాయంత్రం బయటకు వెళ్దామని సంగీత తన భర్త రాజేంద్రను తీసుకెళ్లింది. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై నంజనగూడు సమీపంలోని ముడా లేఅవుట్ వద్దకు చేరుకోగానే, ఒక తెల్ల కారు వారిని అడ్డగించింది. కారులో నుంచి దిగిన విఘ్నేశ్, బాలుడు బైక్‌ను పక్కకు తోసేయడంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. దొంగతనం జరిగినట్లు నమ్మించేందుకు బాలుడు ఆమె మెడలోని గొలుసు లాగేందుకు ప్రయత్నించగా, విఘ్నేశ్ కత్తితో రాజేంద్ర కడుపులో పొడిచాడు. బాధితుడి అరుపులు, అదే సమయంలో అటువైపుగా వాహనాలు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

గాయపడిన రాజేంద్రను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేయగా, అది అద్దెకు తీసుకున్న వాహనమని తేలింది. దీంతో కేసు దర్యాప్తు సులువైంది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, భార్య సంగీత పన్నిన కుట్ర బయటపడింది. ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ రిమాండు తరలించామని, బాలుడిని రిమాండ్ హోంకు పంపించామని ఎస్పీ విష్ణువర్ధన్‌ తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
Sangeetha
Mysore crime
wife kills husband
Nanjanagudu murder attempt
family disputes
crime news
Karnataka police
Vishnuvardhan SP
murder conspiracy
fiber door worker

More Telugu News