Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు భారీ భద్రత.. ఖలిస్తానీ సంస్థ హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తం!

Amitabh Bachchan Security Increased After Khalistan Threat
  • బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు ఖలిస్తానీ సంస్థ నుంచి బెదిరింపులు
  • బిగ్ బీ భద్రతను భారీగా పెంచాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం
  • KBCలో అమితాబ్ కు దిల్జిత్ పాదాభివందనం చేయడమే వివాదానికి కారణం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖలిస్తానీ అనుకూల సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ (SFJ) నుంచి ఆయనకు బెదిరింపులు రావడంతో కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇటీవల అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) షోకు పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమితాబ్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంఘటనే తాజా వివాదానికి దారితీసింది. దిల్జిత్ చర్య 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారిని అవమానించడమేనని SFJ ఆరోపించింది.

1984లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన హింసలో అమితాబ్ బచ్చన్ పాత్ర ఉందని SFJ చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు దిల్జిత్ ఆయన కాళ్లకు నమస్కరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో SFJ చీఫ్ గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్, అమితాబ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాకుండా, నవంబర్ 1న ఆస్ట్రేలియాలో జరగనున్న దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కచేరీని అడ్డుకుంటామని కూడా ప్రకటించాడు.

ఈ పరిణామాలతో అప్రమత్తమైన కేంద్ర నిఘా వర్గాలు అమితాబ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. వారి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Amitabh Bachchan
Khalistan
Six For Justice
SFJ
Diljit Dosanjh
KBC
Kaun Banega Crorepati
1984 Sikh Riots
Gurpatwant Singh Pannun
India

More Telugu News