India vs Australia: భార‌త్‌-ఆసీస్ మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?.. ఫైనల్‌కు వెళ్లేదెవరు?

India vs Australia What happens if the match is cancelled Whos going to the final
  • మహిళల ప్రపంచకప్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్
  • హైవోల్టేజ్ మ్యాచ్‌పై వరుణుడి నీలినీడలు
  • వర్షంతో మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు ఆస్ట్రేలియా
  • గాయంతో టోర్నీకి దూరమైన కీలక ప్లేయర్ ప్రతికా రావల్
  • ప్రతికా స్థానంలో జట్టులోకి యువ క్రీడాకారిణి షఫాలీ వర్మ
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో అసలైన సమరానికి తెరలేచింది. గువాహ‌టిలో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 125 పరుగుల భారీ తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టగా, అందరి దృష్టి రెండో సెమీస్ పోరుపై నిలిచింది. ఈరోజు నవీ ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను అదే రోజు పూర్తి చేయడానికి నిర్వాహకులు చివరి వరకు ప్రయత్నిస్తారు. ఫలితం కోసం ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. నేడు ఆట సాధ్యం కాకపోతే, రేపు (శుక్రవారం) రిజర్వ్ డే రోజున మ్యాచ్‌ను కొనసాగిస్తారు.

రెండు రోజులూ వర్షం వల్ల ఆట సాధ్యం కాకపోతే మాత్రం గ్రూప్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ లెక్కన గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళుతుంది. నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. దీంతో మ్యాచ్ సజావుగా సాగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

కీలక ప్లేయర్ దూరం
ఇప్పటికే వర్షం రూపంలో ఆందోళన నెలకొనగా, ఇండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఓపెనర్ ప్రతికా రావల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికీ దూరమైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆమె గాయపడగా, ప్రపంచకప్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆమె స్థానంలో ఏడాదిగా వన్డే ఆడని 21 ఏళ్ల షఫాలీ వర్మను జట్టులోకి తీసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు ముందు ఇది భారత్‌కు పెద్ద లోటుగా చెప్పవచ్చు.
India vs Australia
ICC Womens World Cup 2025
womens cricket
rain delay
match cancellation
Prathika Rawal injury
Shafali Verma
South Africa
semi final
Nawi Mumbai

More Telugu News