Vijay: విజయ్ సభ తొక్కిసలాట కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ

Vijay Meeting Stampede Case CBI Investigation Begins
  • గత నెల 27న కరూర్‌లో విజయ్ సభలో తొక్కిసలాట 
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిట్ 
  • సిట్ దర్యాప్తును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే 
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ
టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. తమిళనాడు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. గత నెల 27న కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసును ఐజీ ఆశా గార్గ్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేపట్టింది.

అయితే, తమిళనాడు పోలీస్ అధికారులు మాత్రమే ఉన్న సిట్ పై తమకు నమ్మకం లేదంటూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు (సీబీఐ) విచారణ బాధ్యతలను అప్పగించాలని కోరింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ వీ అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవల సీబీఐ దర్యాప్తుకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంతే కాకుండా దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీబీఐ.. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను తిరిగి నమోదు (రీ-రిజిస్టర్) చేసింది. కేసులో టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనందం, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తదితరుల పేర్లను చేర్చింది. స్థానిక కోర్టుకు ఈ మేరకు సమాచారం అందించింది. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధితులు, సంబంధిత కుటుంబాల వాంగ్మూలాలను సేకరించింది. 
Vijay
Vijay meeting stampede
Tamil Nadu stampede
TVK party
CBI investigation
Karur stampede
Justice Rastogi
Bussy Anandam
Nirmal Kumar

More Telugu News