Government Schools: ప్రభుత్వ బడుల దుస్థితి.. విద్యార్థులు లేని స్కూళ్లలో తెలంగాణకు రెండో స్థానం

Telangana Education Second Highest in Zero Enrollment Schools
  • దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు సున్నా
  • విద్యార్థులు లేని స్కూళ్ల జాబితాలో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ
  • రాష్ట్రంలో 2,245 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని వెల్లడి
  • ఈ స్కూళ్లలో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు గుర్తింపు
  • అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 3,812 స్కూళ్లు ఇలాగే ఉన్నట్లు నిర్ధార‌ణ‌
  • గతేడాదితో పోలిస్తే ఇలాంటి స్కూళ్ల సంఖ్య తగ్గడం కొంత ఊరట
ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలకొద్దీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరడం లేదన్న చేదు నిజాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో 'జీరో ఎన్‌రోల్‌మెంట్' నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం, విద్యార్థులు లేని పాఠశాలల జాబితాలో పశ్చిమబెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,245 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే, విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 17,965 మంది ఉండగా, తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు కేటాయించబడ్డారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

అయితే, గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల సంఖ్య 12,954గా ఉండగా, ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గడం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు. మరోవైపు, ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతంలోనూ జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
Government Schools
Telangana Education
Zero Enrollment
School Enrollment
Education Ministry
West Bengal
Student Numbers
Teachers
Education Report
School Statistics

More Telugu News