PM Modi: తరతరాలకు స్ఫూర్తి.. కుమ్రం భీమ్ ఆశయాలను కొనసాగిద్దాం: ప్రధాని మోదీ

PM Modi Praises Kumram Bheems Heroic Fight Against Nizam
  • 'మన్ కీ బాత్‌'లో కుమ్రం భీమ్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
  • నిజాం దురాగతాలపై భీమ్ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమ‌న్న ప్ర‌ధాని
  • ఆదివాసీ సమాజంపై చెరగని ముద్ర వేసిన యోధుడంటూ కితాబు
  • భగవాన్ బిర్సా ముండా సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని
  • వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. వేడుకలకు పిలుపు
  • 21వ శతాబ్దం భారత్-ఆసియాన్‌దేనని ఆసియాన్ సదస్సులో వ్యాఖ్య
ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీమ్ సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తన ధైర్యం, త్యాగంతో లక్షలాది మంది హృదయాల్లో, ముఖ్యంగా గిరిజన సమాజంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆదివారం జరిగిన 127వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ.. నిజాం నిరంకుశ పాలనపై కుమ్రం భీమ్ చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. "20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్య్రం వస్తుందనే ఆశలు లేని సమయంలో హైదరాబాద్ ప్రజలు బ్రిటిష్ వారితో పాటు క్రూరమైన నిజాం దురాగతాలను కూడా భరించాల్సి వచ్చింది. పేదలు, ఆదివాసీలపై వర్ణనాతీతమైన దౌర్జన్యాలు జరిగాయి. వారి భూములను లాక్కుని, భారీగా పన్నులు విధించారు. ఎదురు తిరిగిన వారి చేతులు నరికేశారు. అలాంటి భయంకర పరిస్థితుల్లో, కేవలం 20 ఏళ్ల యువకుడైన కుమ్రం భీమ్ ఆ అన్యాయాన్ని ఎదిరించి నిలబడ్డాడు" అని వివరించారు.

రైతుల పంటలను జప్తు చేయడానికి వచ్చిన నిజాం అధికారి సిద్ధిఖీని భీమ్ బహిరంగంగా సవాలు చేసి హతమార్చారని మోదీ గుర్తుచేశారు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని అస్సోం వరకు వెళ్లారని, తిరిగి వచ్చి నిజాంకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఏకం చేసి 'జల్, జంగల్, జమీన్' నినాదంతో పోరాడారని తెలిపారు. 1940లో నిజాం సైనికుల చేతిలో ఆయన వీరమరణం పొందారని పేర్కొన్నారు. "కుమ్రం భీమ్ జీవించింది 40 ఏళ్లే అయినా, ఆయన జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలి" అని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంగా, నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 'ఆదివాసీ గౌరవ దినోత్సవం' జరుపుకోనున్నామని ప్రధాని తెలిపారు.

వందేమాతరానికి 150 ఏళ్లు
బంకించంద్ర ఛటర్జీ రాసిన 'వందేమాతరం' గీతం వచ్చే నెల 7వ తేదీతో 150వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ గీతం భారతీయులలో దేశభక్తిని, ఐక్యతను నింపుతుందని, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరపాలని ప్రజలను కోరారు. భారతీయ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ముఖ్యంగా ఒడిశాలోని కోరాపుట్ కాఫీ గురించి ప్రస్తావించారు.

21వ శతాబ్దం భారత్-ఆసియాన్‌దే
మరోవైపు, మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియాన్ దేశాల సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. 21వ శతాబ్దం భారత్-ఆసియాన్ దేశాలదేనని ఆయన అన్నారు. ఆసియాన్ 'విజన్ 2045', 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలు ఒకటేనని, ఉమ్మడి చారిత్రక విలువలతో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భాగస్వామ్యం ప్రపంచ సుస్థిర అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi
Kumram Bheem
Komaram Bheem
Narendra Modi
Man Ki Baat
Adivasi
Tribal freedom fighter
Telangana
Nizam
Jal Jangal Zameen
Birsa Munda

More Telugu News