Bobbili: జనం చూస్తుండగానే ప్రాణం విడిచిన వృద్ధురాలు.. బొబ్బిలిలో హృదయ విదారక ఘటన

Heartbreaking Incident in Vizianagaram District Old Woman Dies in Bobbili No One Helped
  • బొబ్బిలిలో రోడ్డుపై కుప్పకూలిన వృద్ధురాలు
  • సాయం చేయకుండా చూస్తూ ఉండిపోయిన జనం
  • అవ్వ కోసం ఏడుస్తూ ఉండిపోయిన మనవడు, మనవరాలు
  • గమనించి ఆస్పత్రికి తరలించిన ఎస్ఐ రమేశ్
  • అప్పటికే ప్రాణాలు కోల్పోయిన మహిళ
  • అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన పోలీస్
జనంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. కళ్లెదుటే ఓ వృద్ధురాలు రోడ్డుపై పడిపోయి, నోటి నుంచి రక్తం కారుతూ గిలగిల్లాడుతోంది. పక్కనే ఆమె పసిపిల్లలైన మనవడు, మనవరాలు సాయం కోసం పెద్దగా ఏడుస్తున్నారు. అయినా ఒక్కరూ స్పందించలేదు, కనీసం దగ్గరకు కూడా వెళ్లలేదు. మానవత్వం సిగ్గుతో తలదించుకున్న ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది.

బొబ్బిలి గొల్లవీధికి చెందిన బొట్ల ఆదమ్మ (65) ఓ నిరుపేద. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె, గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం వైద్యం కోసం తన మనవడు, మనవరాలిని తోడుగా తీసుకుని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ బీపీ మాత్రలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, గొల్లపల్లి ఆటోస్టాండ్ వద్దకు రాగానే ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. వెంటనే ఆమె నోటి నుంచి రక్తం రావడం మొదలైంది.

జరిగిన ఘటనకు భయపడిపోయిన ఆమె చిన్నారులు ఏం చేయాలో తెలియక గట్టిగా ఏడుస్తూ సాయం కోసం అభ్యర్థించారు. అటుగా వెళ్తున్న జనం మాత్రం చూస్తూ ఉండిపోయారే తప్ప సాయానికి ముందుకు రాలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్ఐ రమేశ్ ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే స్పందించారు. ఆయన వృద్ధురాలికి ప్రథమ చికిత్స చేసి, ఓ ఆటోలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఎస్ఐ రమేశ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదమ్మ మృతదేహాన్ని వారి ఇంటికి పంపించడమే కాకుండా, ఆమె అంత్యక్రియల నిమిత్తం కొంత ఆర్థిక సాయం కూడా అందించారు.

ఈ ఘటనపై గొల్లపల్లి యూపీహెచ్‌సీ డాక్టర్ అనిత మాట్లాడుతూ, "ఆదమ్మ బీపీ మాత్రల కోసం వచ్చారు. ఆమెకు బీపీ ఎక్కువగా ఉండటంతో పెద్ద ఆస్పత్రికి వెళ్లాలని సూచించాం. అయితే ఆమె మాత్రలు తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు" అని వివరించారు. ఆదమ్మకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Bobbili
Botla Adamma
Vizianagaram district
old woman death
heartbreaking incident
public apathy
SI Ramesh
primary health center
road accident
Andhra Pradesh

More Telugu News