PVN Madhav: గూగుల్ కోసం రూ.21,800 కోట్ల గ్రీన్ కారిడార్.. ప్రాజెక్టుపై జగన్ మౌనం ఎందుకు?: పీవీఎన్ మాధవ్

PVN Madhav on Google Green Corridor Project and Jagans Silence
  • విశాఖ గూగుల్ డేటా సెంటర్‌పై బీజేపీ కీలక ప్రకటన
  • ప్రాజెక్టు కోసం రూ.21,800 కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్
  • పునరుత్పాదక ఇంధనాన్నే ఎక్కువగా వినియోగించనున్న గూగుల్
  • పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు
  • ప్రాజెక్టుపై వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తోందని ఆరోపణ
  • ఈ అంశంపై జగన్ తన వైఖరి చెప్పాలని బీజేపీ డిమాండ్
విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు మద్దతుగా భారీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, దీనిపై ప్రతిపక్ష వైసీపీ అనవసర దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా రూ.21,800 కోట్ల వ్యయంతో గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు.

గూగుల్ డేటా సెంటర్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను వివరించేందుకు మంగళవారం నగరంలోని గ్రాండ్ బే హోటల్‌లో పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలతో మాధవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ డేటా సెంటర్‌కు భూమి, నీరు, విద్యుత్ అత్యంత కీలకం. రాష్ట్రంలో సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ రూపంలో పునరుత్పాదక ఇంధనం భారీగా అందుబాటులో ఉంది. గూగుల్ ప్రధానంగా ఈ ఇంధనాన్నే వినియోగిస్తుంది" అని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు నీటి అవసరాల గురించి వివరిస్తూ, పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నీటిని నిల్వ చేసేందుకు స్టీల్ ప్లాంట్ సమీపంలో ఒక పెద్ద రిజర్వాయర్‌ను నిర్మించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, సముద్రపు నీటిని శుద్ధి చేసి వినియోగించే ప్రణాళికలు కూడా ఉన్నాయన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ). దీనిని స్వాగతించాల్సింది పోయి, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదా?" అని ఆయన ప్రశ్నించారు. ఈ కీలక ప్రాజెక్టుపై మాజీ సీఎం జ‌గ‌న్‌ కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదని, ఆయన తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని అన్నారు.
PVN Madhav
Google
Vizag
Andhra Pradesh
Green Energy Corridor
Data Center
Jagan Mohan Reddy
YSRCP
Vishnu Kumar Raju
FDI

More Telugu News