Domestic Violence: భార్య నుదిటిలో కత్తి దించిన భర్త.. నోట్లోంచి బయటకు వచ్చిన కత్తి

Andhra Pradesh Man Stabs Wife in Face Knife Exits Mouth
  • కోనసీమ జిల్లాలో భార్యపై భర్త కిరాతక దాడి
  • బాణసంచా డబ్బుల విషయమై తలెత్తిన వివాదం
  • మద్యం మత్తులో భర్త ఘాతుకం
  • కాకినాడ జీజీహెచ్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స
  • ప్రాణాలతో బయటపడిన బాధితురాలు, భర్త అరెస్ట్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ భర్త కట్టుకున్న భార్యపై కిరాతకంగా దాడి చేశాడు. నుదిటిపై కత్తితో బలంగా పొడవడంతో అది పుర్రెను చీల్చుకుని నోటి నుంచి బయటకు వచ్చింది. బాధితురాలు ప్రాణాలతో బయటపడగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పి.గన్నవరం మండలం ఉడిమూడి గ్రామానికి చెందిన నేలపూడి గంగరాజు, పల్లాలమ్మ (36) ఇరవై ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, గంగరాజు మద్యానికి బానిసై తరచూ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం దీపావళి సందర్భంగా బాణసంచా కోసం భార్యకు ఇచ్చిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన గంగరాజు, భార్యతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను, తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతులో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో తల వంచడంతో, కత్తి ఆమె ఎడమ కన్ను పైభాగం నుంచి నేరుగా నోట్లోకి దిగింది.

ఈ దారుణాన్ని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు వెంటనే ఆమెను అమలాపురంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే దీపావళి సెలవు కావడంతో అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో బాధితురాలిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి, కత్తిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పి.గన్నవరం ఎస్ఐ బి.శివకృష్ణ తెలిపారు. నిందితుడు గంగరాజు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. చిన్నపాటి గొడవ ఇంతటి దారుణానికి దారితీయడంతో స్థానికంగా కలకలం రేగింది.
Domestic Violence
Pallalamma
Andhra Pradesh crime
KIMS Hospital Amalapuram
Kakinada Government Hospital
murder attempt
alcohol abuse
family dispute
Dr BR Ambedkar Konaseema district
P Gannavaram

More Telugu News