Salman Khan: బలూచిస్థాన్‌‌ను పాకిస్థాన్ నుంచి వేరు చేసి మాట్లాడిన సల్మాన్ ఖాన్

Salman Khan Separates Balochistan from Pakistan in Speech
  • రియాద్ వేదికగా జాయ్ ఫోరమ్ 2025 కార్యక్రమం
  • హాజరైన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్
  • బలూచిస్థాన్, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి ప్రజలు వచ్చారన్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ నుంచి వేరు చేసి మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా జరిగిన 'జాయ్ ఫోరమ్ 2025' కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలోని దక్షిణాసియా కమ్యూనిటీల్లో భారతీయ సినిమాకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే అది తప్పకుండా విజయవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలు కూడా ఇక్కడ వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని తెలిపారు.

ఇందుకు కారణం ఇతర దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తుండటమేనని ఆయన పేర్కొన్నారు. బలూచిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్, పాకిస్థాన్‌లను వేర్వేరుగా పేర్కొనడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

సల్మాన్ ఖాన్ పొరపాటుగా అన్నారో లేక ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో తెలియదు కానీ, బలూచిస్థాన్ ప్రజలను పాక్ నుంచి వేరు చేశారని, ఇది అద్భుతమని ప్రముఖ జర్నలిస్టు స్మితా ప్రకాశ్ అభిప్రాయపడ్డారు. బలూచిస్థాన్ పాక్‌లో భాగం కాదని, తమది స్వతంత్ర దేశమని బలోచ్ నెటిజన్లు స్పందిస్తున్నారు.
Salman Khan
Bollywood
Balochistan
Pakistan
Saudi Arabia
Joy Forum 2025
Indian Cinema

More Telugu News