Nara Lokesh: అది జరగాలంటే రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh States Competition Between States is Necessary
  • విశాఖలో జరగనున్న సీఐఐ సదస్సుకు హాజరుకావాలని సిడ్నీలో మంత్రి లోకేశ్ పిలుపు
  • విశాఖను ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం
  • గత 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటన 
ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సిడ్నీలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సమర్థవంతమైన, అనుభవం కలిగిన నాయకత్వం ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని లోకేశ్  వివరించారు. దీని ఫలితంగానే గత 16 నెలల కాలంలోనే రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నప్పుడే దేశం పురోగమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్‌లా పనిచేస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సమగ్రాభివృద్ధి జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు.

విశాఖపట్నం తనకు ఎంతో ఇష్టమైన నగరమని, ఇది ఒకేచోట బెంగుళూరు, గోవా లాంటి రెండు ప్రపంచాలను ఆవిష్కరిస్తుందని లోకేశ్ అభివర్ణించారు. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థ రాకతో విశాఖలో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తోందని, నగరాన్ని సమస్యల్లేని అభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు స్వయంగా ఏపీకి వచ్చి ఇక్కడి శక్తిని, ఉత్సాహాన్ని గమనించాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరిస్తూ, 2024 ఎన్నికల్లో ప్రజలు తమ కూటమికి 94 శాతం స్థానాల్లో చారిత్రక విజయాన్ని అందించారని గుర్తుచేశారు. ఉద్యోగాల కల్పన కోసమే ప్రజలు ఇంతటి స్పష్టమైన తీర్పు ఇచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. అందుకే పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను సిడ్నీ వచ్చానని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్, విద్య, మైనింగ్, అగ్రిటెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, ఫార్మా, స్టీల్, ఆక్వా వంటి అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా కలిసి పనిచేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమానికి ముందు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఈ రోడ్ షోలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేషనల్ అసోసియేట్ ఛైర్ ఇర్ఫాన్ మాలిక్, న్యూ సౌత్ వేల్స్ ఎంపీ వారెన్ కిర్బీ, ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ ఆండ్రూ గైల్స్, సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్. జానకి రామన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh economy
Visakhapatnam
AP investments
CII Partnership Summit
AP industrial development
Chandrababu Naidu
Skill development AP
AP Australia collaboration
Double Engine Growth

More Telugu News