Perni Nani: మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు: పేర్ని నాని

Perni Nani Slams Chandrababu Naidu on QR Code Claims
  • క్యూఆర్ కోడ్ ఒక డ్రామా అన్న పేర్ని నాని
  • టీడీపీ మద్యం దందాలు బయటపడటంతోనే క్యూఆర్ కోడ్ డ్రామా అని విమర్శ
  • 17 నెలలుగా టీడీపీ నేతలే నకిలీ మద్యం సరఫరా చేశారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ విధానం ఒక పెద్ద డ్రామా అని, రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూసిన కల్తీ మద్యం దందాను కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలకు తెరలేపారని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తామే కనిపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలోనే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రతి మద్యం బాటిల్‌కు క్యూఆర్ కోడ్ ఉండేదని గుర్తుచేశారు. "మీరు అధికారంలోకి రాగానే ఆ విధానాన్ని ఎందుకు తొలగించారు? ఇప్పుడు మీ మద్యం దందాలు కుళ్లి కంపు కొడుతుంటే, కల్తీ వ్యాపారం చేయిదాటిపోతుంటే మళ్లీ అదేదో ఘనకార్యంలా ఎందుకు తెరపైకి తెస్తున్నారు?" అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

గత 17 నెలలుగా రాష్ట్రంలో టీడీపీ నేతలే లిక్కర్ షాపుల నుంచి బెల్ట్ షాపుల వరకు నకిలీ మద్యాన్ని జోరుగా సరఫరా చేశారని పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే ఈ వ్యవహారం మొత్తం బట్టబయలైందని అన్నారు. కలెక్టర్ల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయని అంగీకరించారని తెలిపారు.

నకిలీ మద్యం కేసులో అరెస్టులు, నిందితుల స్టేట్‌మెంట్లు మొత్తం ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆయన ఆరోపించారు. "ప్రధాన నిందితుడిగా చెబుతున్న జనార్దన్‌ను పెళ్లికి వస్తుంటే రిసీవ్ చేసుకున్నట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనితో 'వైసీపీ హయాం నుంచే చేస్తున్నా' అని ఓ వీడియో స్టేట్‌మెంట్ ఇప్పించి, కథను మాజీ మంత్రి జోగి రమేశ్ వైపు తిప్పేందుకు సిగ్గులేకుండా ప్రయత్నిస్తున్నారు" అని మండిపడ్డారు. ఈ కేసులో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు వంటి వారిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టులు పెడితే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రభుత్వం, ఈ కేసులోని నిందితులకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఆర్భాటంగా ప్రకటించిన 99 రూపాయలకే మద్యం హామీని ఎందుకు అటకెక్కించారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
Perni Nani
Andhra Pradesh
liquor sales
QR code
Chandrababu Naidu
fake liquor
Jogi Ramesh
TDP
liquor scam
belt shops

More Telugu News