AP Tourism: ఏపీలో పర్యాటక రంగం పరుగులు.. అమరావతి, అరకులో లగ్జరీ హోటళ్లకు గ్రీన్ సిగ్నల్

AP Tourism Booms with Luxury Hotels Approval by Ajay Jain
  • అమరావతిలో రెండు 4 స్టార్ హోటళ్లకు అనుమతి
  • అరకులో ఎకో లగ్జరీ రిసార్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
  • టూరిజం పాలసీ 2024-29 కింద భారీ రాయితీలు ప్రకటన
  • 10 ఏళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌
  • పెట్టుబడిలో 10 శాతం సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ పూర్తి మినహాయింపు
  • సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు
ఏపీలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతితో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో భారీ హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులను చేపట్టే సంస్థలకు కొత్త టూరిజం పాలసీ 2024-29 కింద భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నిన్న (గురువారం) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాజధాని అమరావతిలో రెండు నాలుగు నక్షత్రాల (4 స్టార్) హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. వీటిలో ఒక హోటల్‌ను ‘సదరన్‌ గ్లోబల్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌’ నిర్మించనుండగా, మరొకదాన్ని ‘దసపల్లా అమరావతి హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ చేపట్టనుంది. వీటితో పాటు అరకులో పర్యాటకులను ఆకట్టుకునేలా ‘వీఎస్కే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ’ సంస్థ ఒక ఎకో లగ్జరీ రిసార్ట్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ మూడు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఇందులో భాగంగా పదేళ్ల పాటు 100 శాతం ఎస్జీఎస్టీని తిరిగి చెల్లించనుంది. ప్రాజెక్టులో పెట్టే మూలధన పెట్టుబడిలో 10 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. స్టాంప్ డ్యూటీని పూర్తిగా మినహాయించడంతో పాటు, పరిశ్రమలకు ఇచ్చే ధరలకే విద్యుత్తును సరఫరా చేయనుంది. ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకాన్ని కూడా రీయింబర్స్‌మెంట్ చేయనుంది.

ఈ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా, సులభంగా అందించేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను టూరిజం అథారిటీ సీఈవోకి అప్పగిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా చర్యలతో రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెంది, కొత్తగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
AP Tourism
Ajay Jain
Andhra Pradesh Tourism
Amaravati Hotels
Araku Resorts
Tourism Policy 2024-29
Southern Global Hotels
Daspalla Amaravati Hotels
VSK Hotels and Resorts
AP Tourism Development

More Telugu News