Indian Air Force: భారత వైమానిక దళం మరో ఘనత.. ప్రపంచంలోనే టాప్-3లోకి

Indian Air Force Ranks 3rd Globally in Air Power
  • వైమానిక శక్తిలో చైనాను అధిగమించిన భారత్
  • ప్రపంచంలో మూడో అత్యంత శక్తిమంతమైన వాయుసేనగా గుర్తింపు
  • డబ్ల్యూడీఎంఎంఏ తాజా నివేదికలో వెల్లడి
  • జాబితాలో అమెరికా, రష్యాకు తొలి రెండు స్థానాలు
  • 18వ స్థానంలో నిలిచిన పాకిస్థాన్ వైమానిక దళం
ప్రపంచ వైమానిక దళాల శక్తిసామర్థ్యాల్లో భారత వాయుసేన (IAF) సత్తా చాటింది. ఇప్పటివరకు ఆసియాలో అగ్రగామిగా ఉన్న చైనాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతమైన వైమానిక శక్తిగా అవతరించింది. ‘వరల్డ్‌ డైరెక్టరీ ఆఫ్‌ మోడ్రన్‌ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌’ (డబ్ల్యూడీఎంఎంఏ) తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో ఈ విషయం స్పష్టమైంది.

ప్రపంచవ్యాప్తంగా 103 దేశాలకు చెందిన 120 రకాల వైమానిక సేవలను విశ్లేషించి డబ్ల్యూడీఎంఎంఏ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా 242.9 ట్రూ వాల్యూ రేటింగ్ (టీవీఆర్) స్కోర్‌తో మొదటి స్థానంలో తిరుగులేని శక్తిగా నిలిచింది. ఆ తర్వాత 114.2 టీవీఆర్ స్కోర్‌తో రష్యా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, 69.4 టీవీఆర్ పాయింట్లతో భారత వాయుసేన మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న చైనా 63.8 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది.

ఈ జాబితాలో జపాన్ (58.1), ఇజ్రాయెల్ (56.3), ఫ్రాన్స్ (55.3) వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు, పాకిస్థాన్ వైమానిక దళం 46.3 రేటింగ్‌తో 18వ స్థానానికి పరిమితమైంది. ఈ తాజా ర్యాంకులు భారత వైమానిక దళం ఆధునికీకరణ, పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Indian Air Force
IAF
World Air Power Ranking
WDMMA
China Air Force
US Air Force
Russia Air Force
Military Aircraft
Air Force Ranking 2024

More Telugu News