KTR: జూబ్లీహిల్స్‌లో పోరు ప్రారంభమైంది... నిజం, ధర్మం మన వైపు ఉంది: కేటీఆర్

KTR Battle Begins in Jubilee Hills Truth and Dharma are on Our Side
  • కాంగ్రెస్ గురించి తెలిసే గత ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఆ పార్టీని గెలిపించలేదన్న కేటీఆర్
  • గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్య
  • అజారుద్దీన్‌కు ఇచ్చిన ఎమ్మెల్సీ కోర్టులో నిలబడదన్న కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ నగర ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని అన్నారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తుచేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు సైతం ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కానీ, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ కానీ లేరని ఆయన విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేశారని, ఈసారి కూడా ఆయన టిక్కెట్ ఆశిస్తారని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనను తప్పించేందుకు కేవలం కాగితంపై 'ఎమ్మెల్సీ' అని రాసి మోసం చేశారని విమర్శించారు. అజారుద్దీన్‌కు ఇచ్చే ఎమ్మెల్సీ నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసని అన్నారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఆయన తెలిపారు.

షేక్‌పేటలో కబరస్థాన్‌కు ఇచ్చిన స్థలం కూడా ఆర్మీకి చెందినదని, అది కూడా కోర్టులో నిలబడదని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పారని, అది కూడా కోర్టులో నిలబడలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసినా ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలను, మైనార్టీలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు గట్టిగా బుద్ధి చెబితే, ఢిల్లీలోని అధిష్ఠానం సైతం ఉలిక్కిపడుతుందని వ్యాఖ్యానించారు.

ప్రజలు మోసపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని అన్నారు. దుర్గాదేవిలాగా, కాళికాదేవిలాగా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని ఇప్పుడు ప్రతి మహిళ అంటోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించిందని ఆయన ఆరోపించారు. ఒక ఇంట్లో అయితే ఏకంగా 43 దొంగ ఓట్లు నమోదు చేయించారని అన్నారు. కాంగ్రెస్ ఒక్కో వర్గానికి చాలా బాకీ పడిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పెన్షన్ పెంపు, మహిళలకు నెలకు రూ. 2,500, నిరుద్యోగ భృతి ఇలా అన్నీ కాంగ్రెస్ బాకీలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
KTR
KTR BRS
Jubilee Hills
Telangana Politics
Revanth Reddy
Congress Party
BRS Party
Telangana Elections

More Telugu News