Ashwini Vaishnaw: గూగుల్ మ్యాప్స్‌కు స్వదేశీ పోటీ.. 'మ్యాపుల్స్' యాప్ వాడండి: కేంద్ర మంత్రి పిలుపు

Ashwini Vaishnaw promotes Mappls as Google Maps alternative
  • యాప్‌ను ప్రమోట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • గూగుల్ కన్నా ఇందులో ఫీచర్లు అద్భుతం అన్న మంత్రి
  • కారులో వాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినన కేంద్ర మంత్రి
  • 3డీ జంక్షన్ వ్యూ, లైవ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి ఫీచర్లు
  • ఇప్పటికే 3.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్
ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ కోసం విరివిగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీనిచ్చేలా ఓ స్వదేశీ యాప్‌కు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. గూగుల్ మ్యాప్స్ కన్నా మెరుగైన ఫీచర్లతో భారతదేశంలో తయారైన 'మ్యాపుల్స్' (Mappls) నావిగేషన్ యాప్ అద్భుతంగా పనిచేస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు. ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా వాడాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ చేశారు. తాను స్వయంగా తన కారులో 'మ్యాపుల్స్' యాప్‌ను ఉపయోగిస్తున్న వీడియోను పంచుకున్నారు. ఈ యాప్‌లో ఫ్లైఓవర్లు, ఓవర్ బ్రిడ్జిలను సులభంగా గుర్తించవచ్చని, అపార్ట్‌మెంట్లలో ఉండే దుకాణాల వివరాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయని ఆయన వివరించారు. ఇందులో 13 రకాల ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయని, ఇవి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని తెలిపారు. మంత్రి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వదేశీ యాప్‌కు కేంద్ర మంత్రి ప్రచారం కల్పించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'మ్యాపుల్స్' యాప్‌ను మ్యాప్‌మైఇండియా (MapmyIndia) సంస్థ అభివృద్ధి చేసింది. ఈ యాప్‌లో 3డీ జంక్షన్ వ్యూ, లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్లు, భద్రతా హెచ్చరికలు, ప్రాంతీయ భాషల సపోర్ట్ వంటి అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రోడ్లు, జంక్షన్ల పరిస్థితులకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ తెలిపింది. మంత్రి ట్వీట్‌కు స్పందించిన మ్యాప్‌మైఇండియా సంస్థ, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. భారత్‌లో డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, సులభంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొంది. దేశ ప్రజలందరూ స్వదేశీ సాంకేతిక విప్లవంలో భాగస్వాములు కావాలని కోరింది. ఇప్పటివరకు ఈ యాప్‌ను 3.5 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
Ashwini Vaishnaw
Mappls app
MapmyIndia
Google Maps alternative
Indian navigation app
Swadeshi app
Navigation app India
3D junction view
Live traffic signals
Indian roads

More Telugu News